ఆఊరిలో హోలీ వెరైటీగా జరుపుకుంటారు. దేశమంతటా అందరూ రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకుంటే…ఆ గ్రామస్తులు మాత్రం హోలీ తర్వాత రోజు ముక్కూ ముఖం పగిలేలా కొట్టుకుంటారు. పిడి గుద్దులు గుద్దుకుంటారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామం ఈ పంచ్ ఫెస్టివల్ ఈవెంట్ కు వేదికగా నిలుస్తోంది. దాదాపు వందేళ్లుగా ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతోందని చెబుతున్నారు స్థానికులు. ప్రతీ ఏటా హోలీ పండగ మరుసటి రోజు పిడిగుద్దులాట ఆడటం ఇక్కడ ఆనవాయితీ. ఇలా ఆడకపోతే ఊరికి అరిష్టమంటూ.. ప్రతీ ఒక్కరూ ఆటలో పాల్గొనడం ఆచారంగా వస్తోంది. గతంలో ఒకసారి పోలీసుల జోక్యంతో ఈ ఆటను ఆపేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అయితే గ్రామంలో వరుసగా కొన్ని అరిష్టాలు జరిగాయనీ.. దీంతో మళ్లీ ఆటను సంప్రదాయంగా కొనసాగిస్తున్నామంటున్నారు జనం.

 


ఆటలో భాగంగా…దాదాపు 20 నిమిషాల పాటు ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. పోలీసులు ఉన్నా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయరు. హోలీ పండుగ రోజు సాయంత్రం గ్రామస్తులంతా గ్రామ శివారులోని పొలాల్లో ముందుగా కుర్చీల పోటీలు నిర్వహిస్తారు.  తర్వాత గ్రామపంచాయతీ హనుమాన్ గుడి దగ్గర రోడ్డుకు రెండు వైపులా కర్రలు పాతి తాడు కడతారు. తర్వాత డప్పుతో ఊరిలో చాటింపు వేయిస్తారు. అక్కడకు చేరుకున్న జనం..రెండు వర్గాలుగా విడిపోయి ఒక చేతితో తాడు పట్టుకొని, మరో చేతితో కొట్టుకుంటారు. రక్తాలు కారినా వెనక్కి తగ్గరు. గతంలో ఇలా గంటకు పైగా కొట్టుకునేదనీ.. ఇప్పుడు మాత్రం 10 నిమిషాల్లోనే ముగిస్తున్నామని అంటున్నారు.

 


పిడిగుద్దులాటకి అన్ని ఏర్పాట్లు చేశారు గ్రామస్తులు. ఈ ఆటలో కొందరి మూతులు పగులుతాయి. కణతలకు దెబ్బలు తగులుతాయి. గాయపడ్డ వ్యక్తిని తోటివారు భుజాలపై మోసుకెళ్లి కామదహనం చేసిన బూడిదను రాస్తారు. ఈ బూడిదను రాస్తే గాయం మానిపోతుందని వీరి నమ్మకం. అంతా అయిపోయాక షేక్ హ్యాండిచ్చుకుని ఇళ్లకు వెళ్లిపోతారు ఊరిజనం. వందలేళ్లుగా హోలీ తర్వాత రోజు ఈ సంప్రదాయ ఆట జరుగుతోంది. ఆట పూర్తయ్యాక… కల్లు, మందు, ముక్కతో పసందుగా విందు చేసుకుంటారు హున్సా గ్రామస్థులు.

మరింత సమాచారం తెలుసుకోండి: