స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూసుకెళ్తోంది. ఎన్నిక జరగకుండానే చాలా ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. గుంటూరు జిల్లాలో రికార్డుస్థాయిలో ఏకగ్రీవం జరిగాయి. ఇక టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు ఇలాఖాలో వైసీపీ బోణీ కొట్టింది. 

 

ఏపీ మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీ బోణీ చేసింది. చాలాచోట్ల ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. ఎక్కువగా గుంటూరు జిల్లాలోనే జరిగాయి. మాచర్ల నియోజకవర్గంలోనిక ఐదు మండల పరిషత్‌లు ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. మొత్తం అన్ని మండలాల్లో కలిపి 71ఎంపీటీసీ స్థానాలు ఉండగా... 60 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. వెల్దుర్ది, మాచర్ల మండలాల్లో పద్నాలుగింటికీ 14 స్థానాలను కైవసం చేసుకుంది. కారంపూడిలో 15కు 11, దుర్గి మండలంలో 14కు 10, రెంటచింతలలో 14, 11 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఎంపీపీ పదవులు చేపట్టేందుకు  ఆ పార్టీకి మార్గం సుగమమయ్యింది. ఇంకా 11 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నారు. 

 

ఏపీ టీడీపీ అధ్యక్షులు కళావెంకట్రావ్ సొంత ఇలాఖాలో ఎదురుదెబ్బ తగిలింది. రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాలవలస మండలంలో మూడు.. సంతకవిటి మండలంలో రెండు ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ చాలా స్థానాలు అధికార పార్టీ సొంతమయ్యాయి. పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలంలో మూడు ఎంపిటీసీలు ఏకగ్రీవమయ్యాయి.  ఎచ్చెర్ల నియోజకవర్గంలో 1 ఎంపీటీసీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలైంది. ఇక పాలకొండ నియోజకవర్గం వీరఘట్టంలో ఒకటే నామినేషన్‌ వచ్చినట్టు ఈసీ తెలిపింది.

 

ఇటు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 32ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలోనే అధిక ఎంపీటీసీలు ఏకగ్రీవమైన నియోజకవర్గం పుంగనూరుగా నిలిచింది. పెద్దిరెడ్డి సొంతమండలం సదుంలో 10 ఎంపీటీసీలు ఉండగా అన్నిచోట్ల ఏకగ్రీవమైనట్లు సమాచారం. నామినేషన్ల విత్‌డ్రాలకు శుక్రవారం చివరి రోజు. ప్రత్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటే... మరికొన్ని వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: