ఎంతో ఆనందంగా పెళ్లికి వెళ్లారు.. బంధువులందరూ సందడి మధ్య పెళ్లి జరిపించారు. ఇక సంతోషంగా విందు భోజనం చేశారు. కానీ ఇంతలో వారి జీవితంలో పెను విషాదం నెలకొంది. పెళ్ళికి వెళ్లి వస్తున్న ఆటో బోల్తా పడి నలుగురు ప్రాణాలు పోయాయి. మిగిలిన వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లాలో ఆటో బోల్తా పడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఇక అదే ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

 

 అయితే బాధితులను జిల్లాలోని సరుబుజ్జిలి మండలం కొత్తపేట వాసులుగా గుర్తించారు. నరసన్నపేటలో జరిగినా తన బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు వీరందరూ. ఇక అక్కడ పెళ్ళి తంతు ముగిసిన అనంతరం... మళ్లీ ఆటో లో తిరుగు ప్రయాణం అయ్యారు. ఇక ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో వారి జీవితాలలో పెను విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వచ్చి వారిని కబలించింది.. బైరి కూడలి వద్ద కు రాగానే ఆటో ఒక్కసారిగా బోల్తా పడి పోయింది. ఈ ఘటనలో తండ్రి కొడుకులు అయిన వెంకటి,  సింహాచలం తో పాటు శ్రీలత అనే మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందింది. 

 

 

 ఇక ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్ర స్థాయిలో గాయపడిన మిగతా ప్రయాణికులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక అక్కడ చికిత్స పొందుతూ గణేష్ అనే  వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. రోడ్డు నిబంధనలు పాటించక పోవడం అతివేగం వెరసి  ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎంతో సంతోషంగా జరగాల్సిన ప్రయాణాలు విషాద ఛాయలతో అలుముకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: