వైసీపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఎంసెట్ కు ఏప్రిల్ 5 వరకు... ఐసెట్ కు ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అత్యవసరం అయితే మాత్రమే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. ప్రజలకు మార్చి 29న రేషన్ అందిస్తామని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా వేశామని పేర్కొన్నారు. 
 
లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించినందుకు 330 మందిపై కేసులు నమోదు చేశామని వ్యాఖ్యానించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు వాలంటీర్లు ఇస్తారని తెలిపారు. ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో కరోనా గురించి ప్రజలకు భయాందోళనకు గురి చేస్తే వార్తలు వైరల్ అవుతున్నాయని... వాటిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. 
 
అలాంటి వార్తలను పబ్లిష్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేలిముద్ర అవసరం లేకుండా పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కరోనా విషయంలో చేసిన సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. జిల్లాల సరిహద్దులను కూడా మూసివేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై వ్యాధిని అరికట్టడానికి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. 
 
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పని చేసిన వైద్య, మున్సిపల్, పోలీస్, విలేకర్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయని... నెల్లూరులోని కరోనా బాధితుడు డిశ్చార్జి చేశారని చెప్పారు. లక్ష N95 మాస్కులను, 150 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాకు సంబంధించిన కాల్ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. కరోనా కట్టడి కోసం గ్రామ, వార్డు వాలంటీర్లు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.         

మరింత సమాచారం తెలుసుకోండి: