ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని పూర్తిగా తొలగిస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలన్న జగన్ సర్కారు అభిమతానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేసింది. అయితే జగన్ సర్కారు మాత్రం ఈ విషయంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టుకు వెళ్లయినా సరే ఏపీలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడతామని చెబుతోంది.

 

 

ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి ఉన్నారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును విజయమో, అపజయమో అని తాము భావించడం లేదని ఆయన అన్నారు. దశలవారీగా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం పెట్టడానికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. బడుగు బలహీనవర్గాల వారికోసం ముఖ్యమంత్రి జగన్ ఎంతవరకైనా పోరాటం చేస్తారని ఆయన అన్నారు .

 

 

ఈ విషయంపై హైకోర్టు తీర్పు వచ్చాక, అవసరమైతే సుప్రింకోర్టుకు వెళతామని ఆయన అన్నారు. ఆంగ్ల మీడియం అన్నది ఒక విప్లవాత్మక నిర్ణయం అని ఆయన అన్నారు. విప్లవాత్మక నిర్ణయాన్ని అమలు దిశగా కోర్టుకు అన్ని సమర్పిస్తామని, కోర్టు కూడా ఆమోదం తెలుపుతుందని మంత్రి సురేష్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంగ్ల మాధ్యమానికి అనుకూలంగా అన్ని పాఠశాలల్లోని పేరెంట్స్‌ కమిటీలు కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

 

 

విశాఖ జిల్లాలో 96 శాతం, నెల్లూరులో 95, చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పేరెంట్స్‌ కమిటీలు 90 శాతం తీర్మానం చేశాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు. పేరెంట్స్‌ కమిటీ తీర్మానాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాద్యమం అమలు చేయాలని ఇప్పటికే అసెంబ్లీలో చర్చించామన్నారు. మొదట ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించినా, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన కూడా స్వాగతించారని గుర్తు చేశారు. ఇప్పుడు హైకోర్టు అభ్యంతరం చెప్పిందని చంద్రబాబు, టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేయడం వారి ఆలోచన ఏంటో అర్థమైందని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: