కరోనా కిట్ల కొనుగోలు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించి తన సీటుకు తానే ఎసరు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యవహారంపై పార్టీలు, ప్రభుత్వాలు తలమునకలై ఉన్నాయి. ఈ విపత్తు నుంచి దేశ ప్రజలను ఏవిధంగా బయటపడేయాలి, అలాగే దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కొని మళ్లీ సాధారణ పరిస్థితి తీసుకు రావాలి అనే ఆలోచనతో కేంద్రం ఉంది. కేంద్రం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి అన్ని రాష్ట్రాలు మద్దతు పలుకుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం బిజెపి అడుగుజాడల్లోనే నడుస్తూ, కేంద్రానికి ప్రతి సందర్భంలోనూ అండగా నిలబడుతూ వస్తోంది. అయితే ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. 

 

IHG

 

తాజాగా దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారంలోనూ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం కమిషన్లు తీసుకుని వాటిని ఎక్కువ ధరకు కొనుగోలు చేసింది అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే చేసినట్లుగా ఆయన పై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంలో కన్నా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా తో సతమతమౌతున్న ఈ విపత్కర సమయంలో కన్నా ఈ విధంగా ఆరోపణలు చేయడంపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఆదేశాలతోనే ఐ సి ఎం ఆర్ కిట్లను కొనుగోలు చేసిందని అధిష్టానం పెద్దలు 'కన్నా' కు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. 

 

కరోనా నివారణకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం జరుగుతున్నాయని, మీ సొంత ఎజెండా కోసం ప్రభుత్వ చర్యలను ఎలా తప్పు పడతారు అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనవసర, అసంబద్ధత ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్ట తీయవద్దంటూ కన్నాకు కాస్త గట్టిగానే అధిష్టానం పెద్దలు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. త్వరలోనే కరోనా వ్యవహారం ముగిసిన తర్వాత కన్నాను తప్పించి వేరొకరికి ఏపీ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అది కాకుండా ఇప్పటికే కన్నా వ్యవహారంపై బిజెపి పెద్దలకు అంతగా సదభిప్రాయం లేదని, ఆయన ఆధ్వర్యంలో పార్టీ బలపడే అవకాశం కూడా లేదన్నట్లుగా అధిష్టానం ఇప్పటికీ ఒక అభిప్రాయానికి వచ్చిందట. త్వరలోనే ఏపీకి కొత్త బీజేపీ అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: