ఏ రాష్ట్రంలోనైనా ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు గత ఐదేళ్ల పాలనను విశ్లేషించి అదే పార్టీకి అధికారం ఇవ్వడం లేదా మరో పార్టీకి అధికారం ఇవ్వడం చేస్తూ ఉంటారు. పలు సందర్భాల్లో మన రాజకీయనాయకులు కూడా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏ ప్రాజెక్టులపై విమర్శలు చేస్తారో అధికారంలోకి వచ్చినపుడు అవే ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ ఉంటారు. తాజాగా ఏపీలో సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టులపై విమర్శలు చేశారో ఇప్పుడు అవే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం చర్చకు దారి తీస్తోంది. 
 
తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో జగన్ సర్కార్ భోగాపురం ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం నమూనాకు జీ.ఎం.ఆర్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. చంద్రబాబు ప్రభుత్వం ఈ విమానశ్రయం కోసం 2700 ఎకరాలు ఇచ్చిందని... తమ ప్రభుత్వం 500 ఎకరాల భూమిని వాపస్ తీసుకోవడంతో 1500 కోట్ల రూపాయల(ఎకరానికి మూడు కోట్ల రూపాయలు) చొప్పున ఆదా అయిందని జగన్ సర్కార్ చెబుతోంది. 
 
గతంలో వైసీపీ జీ.ఎం.ఆర్ కు ఈ ప్రాజెక్ట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇవ్వకుండా జీ.ఎం.ఆర్ కు ఇవ్వడం ఏమిటని వైసీపీ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లెం ఈ ప్రాజెక్టుపై విమర్శలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్ సర్కార్ ఏ చంద్రబాబు ప్రాజెక్టులపై విమర్శలు చేసిందో అవే ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తూ ఉండటం గమనార్హం. 
 
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా వ్యవస్థల్లో పెద్దగా మార్పులు రాకపోవడం గమనార్హం. అప్పట్లో పట్టిసీమపై తీవ్ర విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. చంద్రబాబు ఎన్నో ప్రాజెక్టుల్లో అక్రమాలు చేశాడని విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు ఏ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించడం లేదు. గతంలో గ్రీన్ కో ఒప్పందాలపై తీవ్ర విమర్శలు చేసిన జగన్ సర్కార్ ప్రస్తుతం గ్రీన్ కో ప్రతిపాదిత ప్లాంట్లు అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని పార్టీలకు గతంలో తప్పులుగా కనిపించిన ప్రాజెక్టులే అధికారంలోకి వచ్చాక ఒప్పులుగా కనిపిస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: