మేకపాటి గౌతమ్ రెడ్డి...వైసీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు. అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించి...వైఎస్సార్ మరణం తర్వాత జగన్‌తో కలిసి నడిచారు. జగన్ కోసం ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసి, ఉపఎన్నికల్లో నిలబడి అదిరిపోయే విజయం అందుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో కూడా వైసీపీ తరుపున నెల్లూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి ఆయన రాజకీయాల నుంచి కాస్త సైడ్ అయ్యారు.

 

కాకపోతే ఆయన తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి మాత్రం వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో ఆత్మకూరు బరిలో నిలబడి విజయం సాధించిన గౌతమ్....2019 ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఈ క్రమంలోనే మంత్రి కూడా అయ్యారు. కీలకమైన వాణిజ్య, ఐటీ శాఖని గౌతమ్ దక్కించుకున్నారు. అయితే తొలిసారి మంత్రి అయిన గౌతమ్...త్వరగానే తన శాఖలపై పట్టు తెచ్చుకున్నారు.

 

అసలు ఈ ఏడాది కాలంలో చాలామంది మంత్రులు ఏదొక వివాదంలో చిక్కుకుంటే...గౌతమ్ రెడ్డి మాత్రం ఎలాంటి వివాదాలకు జోలికి పోలేదు. అలాగే తన నియోజకవర్గంలో కూడా ఎలాంటి వివాదాస్పదమైన ఘటనలు జరగలేదు. ఇక దందాలు, బెదిరింపులు లాంటి కార్యక్రమాలు ఈయన నియోజకవర్గంలో లేవు. ప్రతిపక్ష టీడీపీ నేతలని సైతం కలుపుకునిపోయేలా నియోజకవర్గంలో ముందుకు నడుస్తున్నారు. మంత్రిగా ఉండటంతో నిధులు తెచ్చుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు.

 

మంత్రిగా కూడా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అయితే మిగిలిన మంత్రులు మాదిరిగా ప్రతిపక్ష టీడీపీపై ఒంటికాలి మీద ఏమి వెళ్ళడం లేదు. ఏదైనా తన శాఖ పరంగా ఏమన్నా విమర్శలు వస్తే, వాటికి మాత్రం కౌంటర్లు ఇస్తున్నారు. ఇక టీడీపీ నేతలు సైతం గౌతమ్ రెడ్డిని పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. ఏదో ఆయన పని ఆయన చేసుకుని వెళ్లిపోతారు కాబట్టి, టీడీపీ నేతలు కూడా గౌతమ్ జోలికి వెళ్ళడం లేదు. మొత్తానికైతే ఈ ఏడాది కాలంలో గౌతమ్ వివాదాలకు దూరంగానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: