దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్కెట్లలో కొన్ని కూరగాయలు కిలో 50, 60 పలుకుతుంటే మరికొన్ని కూరగాయలు కిలో 10, 20 పలుకుతున్నాయి. కొన్ని రోజుల క్రితం తక్కువ ధర పలికిన టమాటకు రెక్కలొచ్చాయి. మార్కెట్లలో ప్రస్తుతం కిలో టమాట పలు ప్రాంతాల్లో 50కు పైగా పలుకుతుండగా పలు ప్రాంతాల్లో 60కు పైగా పలుకుతోంది. 
 
కరోనా ప్రభావంతో పాటు పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం వల్ల టమాట రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం 5, 10 రూపాయలు పలికిన టమాట ప్రస్తుతం కిలో 50, 60 పలుకుతూ ఉండటంతో వినియోగదారులు కిలో కొనుగోలు చేయాల్సిన వినియోగదారులు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో టమాట రేటు మరింత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
రాబోయే రెండు, మూడు నెలల వరకు టమాట ధరలు తగ్గే అవకాశం లేదని.... కొత్త పంట మార్కెట్లో అందుబాటులోకి వస్తే మాత్రమే టమాట ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకు సగటున 6 వేల క్వింటాళ్ల మేర టమాట కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ ఆ మేర టమాట దిగుమతి జరగడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి టమాట పంటను దిగుమతి చేసుకుంటున్నారు. 
 
తెలంగాణలో ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్లే ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయడంతో టమాట కొనుగోళ్లు తగ్గటంతో పాటు రేటు పడిపోయింది. ఈ నెల 8 నుంచి సడలింపులు అమలు కావడంతో టమాట వినియోగం పెరిగింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు మార్కెట్లో టమాట రేటు వింటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: