2019 ఎన్నికల్లో కనీసం 30 , 40 స్థానాలు వస్తాయని బలంగా నమ్మిన జనసేన పార్టీకి ఆ ఎన్నికల్లో నిరాశే ఎదురయింది. స్వయంగా అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెందగా, తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. అయితే ఆయన ప్రస్థానం ఆ పార్టీలో మూడునాళ్ళ ముచ్చటగానే అయ్యింది. గెలిచిన కొద్ది నెలలకే ఆ పార్టీకి క్రమక్రమంగా దూరమవుతూ వచ్చారు. పార్టీ తరఫున తాను ఒకే ఒక్కడిని గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నా, తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా, నాదెండ్ల మనోహర్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ ఆ పార్టీకి దూరమై, జగన్ కు జై కొట్టి, ఆ పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.


ఇంత వరకు బాగానే ఉన్నా, ఆయన ఇప్పుడు వైసిపి గ్రూపు రాజకీయాల కారణంగా చెప్పుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వయంగా రాపాక కు ఏపీ సీఎం జగన్ దగ్గర మంచి మార్కులే పడుతున్నా, నియోజకవర్గంలో మాత్రం గ్రూపు రాజకీయాల కారణంగా పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా రాజోలు నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో ఒక గ్రూపు కు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన బొంతు రాజేశ్వరరావు నాయకత్వం వహిస్తుండగా, ప్రస్తుతం రాజోలు వైసీపీ ఇంఛార్జిగా ఉన్న అమ్మాజీ ది మరో వర్గం. అయితే రాపాక వైసీపీ కి అనుబంధంగా కొనసాగుతున్నపాటి నుంచి రాపాక పెదపాటి అమ్మాజీ వర్గం తోనే ఉంటున్నారు.


అయితే కొద్ది రోజులుగా ఆ వర్గం కూడా ఈయనను పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తుండడం, అటు బొంతు రాజేశ్వరరావు వర్గమూ ఇదే వైఖరితో ఉండటం, వంటి కారణాలతో రాపాక వరప్రసాద్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  జనసేన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో అటు  జనసైనుకుల క్యాడర్ దూరం అయ్యి, ఇప్పుడు వైసీపీలో గ్రూపు రాజకీయాలు కారణంగా రెండు గ్రూపులు తనకు వ్యతిరేకంగా ఉండడంతో, ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఆయన ఉన్నారట. ఈ వ్యవహారంపై వైసిపి అగ్రనాయకులు దగ్గరే తేల్చుకోవాలనే ఆలోచనలో రాపాక ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: