తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణం ఎలా ఉంటుందో.. వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ దిశగా ప్రయాణించి ఈరోజు అంటే అక్టోబరు 14 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరియు దానిని ఆనుకుని ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలలో  గుల్బర్గా  అంటే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక కు ఉత్తర దిశగా 40 కిలో మీటర్లు, షోలాపూర్ అంటే మధ్య మహారాష్ట్ర కు తూర్పు దిశగా 110 కిలో మీటర్ల  దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.

రాగల 12 గంటలలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి సుమారుగా అక్టోబర్ 16 వ తేదీన మహారాష్ట్ర తీరంకు దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది.  మహారాష్ట్ర - దక్షిణ గుజరాత్  తీరాలను ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్రం ప్రాంతాలలో ఇది వాయుగుండముగా బలపడి క్రమేపి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

ఈ కారణంగా ఈరోజు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అంటే 15న, ఎల్లుండి అంటే 16న తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు కాస్త ఊరట చెందొచ్చన్నమాట. వర్షాలు తగ్గాయి కాబట్టి సహాయ చర్యలు జోరందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చెరువులు నిండి వాగులు పొంగి రహదారులు తెగిపడి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు ఒకటి, రెండు రోజుల్లో చక్కబడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: