ఏపీ సీఎం జగన్ న్యాయ వ్యవస్థపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని.. కొందరు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు పక్షపాతంతో తీర్పులు చెబుతున్నారని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆంధ్రజ్యోతి పత్రిక ఓ సంచలన ఆరోపణ చేసింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణకు వ్యతిరేకంగా జగన్ పోరాడేందుకు ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సహకరిస్తున్నారట. ఆయన జగన్‌ తో కుమ్మక్కయ్యారట. ఇంతకీ ఆ మాజీ న్యాయమూర్తి ఎవరో తెలుసా.. ఆయనే జస్టిస్ చలమేశ్వర్ అట. జస్టిస్ చలమేశ్వర్ కొద్దికాలం క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రజ్యోతి ఏం చెబుతున్నదంటే..  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేసిన జస్టిస్‌ చలమేశ్వర్‌కు జస్టిస్‌ రమణ అంటే పొసగదట.

తాను ప్రధాన న్యాయమూర్తి పదవిని అందుకోలేకపోవడానికి జస్టిస్‌ రమణతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని జస్టిస్‌ చలమేశ్వర్‌ తన సన్నిహితుల వద్ద విమర్శిస్తుంటారట. ఈ అనుమానం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి జస్టిస్‌ చలమేశ్వర్‌కు జస్టిస్‌ రమణపై అసూయ, ద్వేషం ఏర్పడ్డాయట. తనకు దక్కని భారత ప్రధాన న్యాయమూర్తి పదవి జస్టిస్‌ రమణకు కూడా దక్కకూడదన్న ఉద్దేశంతోనే జస్టిస్‌ చలమేశ్వర్‌ తెర వెనుక మంత్రాంగం నడిపారట.


భారత ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదు ప్రతిని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జస్టిస్‌ చలమేశ్వర్‌ కూడా పాల్గొంటారని  అనుకున్నారని ఆంధ్రజ్యోతి రాసింది. అంతే కాదు.. ముఖ్యమంత్రి తరఫున ఫిర్యాదు లేఖను జస్టిస్‌ చలమేశ్వర్‌ రూపొందించారని అధికార పార్టీ నాయకులే చెబుతున్నారు. మరి ఈ అంశంపై జస్టిస్ చలమేశ్వర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయన ప్రస్తుతం మాజీ కాబట్టి ధైర్యంగా తన అభిప్రాయాలు చెప్పొచ్చు. మరి ఆయన నోరు విప్పితే ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: