ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల  వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. మొదటగా వైసిపి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ పెద్ద హడావుడి చేసింది. కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయనే నెపంతో, ఆకస్మాత్తుగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఈ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. కనీసం పార్టీలను సంప్రదించకుండా ఏకపక్షంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు అంటూ మండిపడడమే కాకుండా, ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళింది. ఆ తరువాత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా పెరిగిపోవడం, లాక్ డౌన్ విధింపు ఇలా ఎన్నో వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. 


ఆ సమయంలోనే ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైసిపి ప్రభుత్వం మధ్య వివాదం తీవ్రస్థాయిలో కి వెళ్ళిపోయింది. ఆయన చంద్రబాబు మనిషి అంటూ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఆరోపణ లు చేస్తూనే వస్తోంది. ఇదిలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంతం పట్టగా, వైసిపి మాత్రం మార్చి తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలి అని,  కంకణం కట్టుకుంది. దీనికి కారణం, మార్చి లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ కాబోతున్నారు. ఆయన ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడతాయి అని వైసిపి ప్రభుత్వం నమ్ముతోంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్నందున ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం కోరుతుండగా, బీహార్ లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, ఏపీలోనూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ,  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టి విజయవంతంగా ముగించాలని ఈసీ భావిస్తున్నారు. 


నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే, ఫలితాలు తారుమారు అవుతాయి అని వైసీపీ పెద్దలు నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఈ ప్రక్రియను కొత్త ఈసీ ఆధ్వర్యంలో ముగించాలని వైసిపి అభిప్రాయపడుతోంది. ఏది ఏమైనా ఈ వ్యవహారం పెద్ద చిక్కు ముడిగానే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: