రోజుకు లక్షకు పైగా కేసులు.. వెయ్యికి పైగా మరణాలు..! దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ తీవ్రతకు ఈ లెక్కలే ఉదాహరణ.  జనాలను వణికించిన కోవిడ్‌ వైరస్‌ ప్రభావం తగ్గుతోంది. డిసెంబర్‌ చివరి వారం నాటికి కేసులు గణనీయంగా తగ్గాయి. మరణాల సంఖ్యలోనూ భారీ తేడా కనిపిస్తోంది.

దేశంలో పీక్స్‌కి చేరిన కరోనా కేసులు నెమ్మదిగా.. నేలకు దిగుతున్నాయి. జనవరి నుంచి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. దేశంలో కరోనా కేసులు.. మరణాల లెక్కల్లో భారీ తేడా కనిపిస్తోంది. మార్చి నుంచి మొదలైన కరోనా మరణాలు గతేడాది చివరి నాటికి లక్షా 48 వేలకు చేరాయి. గత అక్టోబర్‌ నుంచి భారీగా తగ్గుదల కనిపిస్తోంది.

డిసెంబరులో పరిస్థితులు మరింతగా మెరుగుపడ్డాయి. సంఖ్యా పరంగా చూస్తే జులై స్థాయికి పరిస్థితులు మారిపోయాయి. జులైలో రోజుకు సగటున 390 మరణాలు సంభవించగా డిసెంబర్‌లో 374 మంది కోవిడ్‌తో  చనిపోయారు. డిసెంబరు తొలి వారంతో పోలిస్తే చివరి వారం నాటికి స్థితిగతులు మారిపోయాయి. గత నెల తొలి ఏడు రోజుల్లో సగటున 35,073 కేసులు నమోదు కాగా ఆ తర్వాతి వారాల్లో భారీగా తగ్గాయి. డిసెంబర్‌ చివరి మూడు రోజుల్లో రోజువారీ కేసులు 19,601కి పడిపోయాయి. మరణాల్లోనే ఇదే సీన్‌ కనిపిస్తోంది.

గత నెల చివరి మూడు రోజుల్లో సగటున 279 మరణాలు సంభవించాయి. దీన్నిబట్టి డిసెంబరు తొలి వారంతో పోలిస్తే 31 నాటికి కేసుల పరంగా 44.11%, మరణాల పరంగా 43%మేర రోజువారీ తగ్గుదల కనిపిస్తోంది. దేశంలో కరోనా ఉధృతికి పెద్ద రాష్ట్రాలు వణికిపోయాయి. పెద్ద రాష్ట్రాలపైనే కరోనా ప్రభావం అధికంగా కనిపించింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ, గుజరాత్‌లలో పరిస్థితులు భీకరంగా కనిపించాయి. కేరళలో మొదలైన వైరస్‌.. ఏడాది చివరి నాటికి మళ్లీ అక్కడే కేసులు పెరుగుతున్నాయి. గత నెల రోజులుగా రోజు వారీ కేసుల పరంగా ఆ రాష్ట్రం తొలి స్థానంలో నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: