వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసింది.కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఇద్దరికీ ఆస్తుల దగ్గర గొడవలు వచ్చాయి. దాంతో జగన్మోహన్ రెడ్డితో విభేదించి వైసిపి నుండి తప్పుకుంది. తెలంగాణలోకి వచ్చి పాదయాత్ర చేసి కొత్త పార్టీ ప్రకటించింది.కానీ ఆమె ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు.చివరికి దాన్ని కాంగ్రెస్ లో కలిపేసింది. అలా కాంగ్రెస్ షర్మిల కి కూడా ఓ ఆఫర్ ఇచ్చింది.ఏపీ పీసిసి చీఫ్ పదవిని షర్మిలకి కట్టబెట్టారు. కానీ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పీసిసి చీఫ్ పదవిలో ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉంది. కనీసం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూసింతైనా పెరగలేదు. అయితే రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు అధికార పార్టీని విమర్శలు చేస్తూ వారు చేసే తప్పులను ఎత్తిచూపుతూ తమ గళం విప్పితేనే ప్రజల్లో హైలైట్ అవుతారు. కానీ షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. 

షర్మిల కి ఎప్పుడు అన్న మీద విమర్శలు చేయడం తప్ప అధికార పార్టీని విమర్శించే సత్తా లేదు అని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా అర్థమై ఉంటుందని అందుకే ఏపీ పీసిసి చీఫ్ పదవి నుండి షర్మిలను తొలగించి మరో కీలకమైన వ్యక్తికి ఆ పదవిని అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం రీసెంట్ గా రాహుల్ గాంధీ హైదరాబాద్ కి వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలని కలిశారు. ఇందులో భాగంగా ఏపీకి చెందిన కొంతమంది కాంగ్రెస్లోని కీలక నేతలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో పూసగుచ్చినట్టు చెప్పడమే కాకుండా పిసిసి చీఫ్ షర్మిల ఆ పదవికి సరిపోరని చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే ఏపీలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల నిర్ణయం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం పిసిసి చీఫ్ పదవి నుండి షర్మిలను తప్పించి ఆ పదవిని గోదావరి జిల్లాలకు చెందిన కేంద్ర మాజీమంత్రి పల్లం రాజుకి ఏపీ పీసిసి చీఫ్ పదవిని ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పల్లం రాజుకి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది.ఎందుకంటే ఈయన గతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కీలకమైన పదవిలో కొనసాగారు. రాజకీయాల్లో ఎంతో నైపుణ్యత,చైతన్యం కలిగిన పల్లం రాజుకి ఏపీ పీసిసి చీఫ్ పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. అలాగే షర్మిలను ఆ పదవి నుండి తొలగించి కేంద్ర స్థాయిలో ఏదైనా కీలకమైన పదవి ఇవ్వాలని చూస్తున్నారట. మరి చూడాలి ఏపీ పీసిసి చీఫ్ గా షర్మిలను తొలగించి పల్లం రాజుకి ఆ బాధ్యతను కట్టబెడతారా అనేది..

మరింత సమాచారం తెలుసుకోండి: