తెలంగాణలో బీజేపీ ఈ మధ్య బాగా యాక్టివ్ అయ్యింది. ప్రత్యేకించి మత అంశాలను హైలట్ చేస్తూ బాగా పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాతబస్తీపై సర్జికల్ దాడులు చేస్తామన్న డైలాగులు బాగా పేలాయి. దాని ఫలితం కూడా బాగానే కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ నేతలు రామమందిర నిర్మాణం అంశాన్ని కూడా బాగానే ప్రస్తావిస్తున్నారు. రామమందిరానికి విరాళాలు కూడా సేకరిస్తున్నారు. అయితే ఈ విరాళాల అంశం కూడా వివాదాస్పదం అయ్యింది.

రామాలయానికి విరాళాలు ఎందుకివ్వాలని..ఓ టీఆర్ఎస్ నేత ప్రశ్నించడం బాగా వివాదాస్పదం అయ్యింది. ఈ అంశంపై బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. దీనిపై స్పందించిన పార్టీ జాతీయ నేత మురళీధర్ రావు ఓ కొత్త విషయం చెబుతున్నారు. రామమందిర విరాళాలపై విమర్శిస్తున్న టీఆర్ఎస్ నాయకులు దొంగచాటుగా ఓ పని చేస్తున్నారట. అదే రామమందిరానికి విరాళాలు ఇవ్వడమట.

రాముడి గుడితో టీఆర్ఎస్ చీకటి యుద్ధం చేస్తోందన్న మురళీధరరావు.. రామమందిరానికి విరాళాలు ఇవ్వొద్దని తెరాస పెద్దలు చెప్పాలని సవాల్ విసిరారు. రాముడు నడిచిన నేల తెలంగాణ.. తెరాస నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు  మురళీధరరావు. తెరాస నాయకులే దొంగ చాటుగా రాముడు గుడికి చందాలిస్తున్నారని కామెంట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి పక్షవాతం వచ్చిందన్న  మురళీధరరావు.. రైతు ఉద్యమం హింసాత్మకంగా మారటానికి కాంగ్రెస్ కారణమన్నారు.ప్రతిపక్ష పాత్ర పోషించటంలో కాంగ్రెస్ విఫలమైందని చురకలు వేశారు.

తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపటానికి భాజపా పోరాడుతోందని.. కార్పోరేషన్, ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నికల్లో తెరాస మాకు ప్రధాన ప్రత్యర్థి అని మురళీధరరావు అన్నారు. సాగర్ టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉంది. అందుకే అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతోంది అని మురళీధరరావు అన్నారు.పీఆర్సీ నివేదిక అశాస్త్రీయంగా తయారు చేయబడిందని.. పీఆర్సీ నివేదికపై కేసీఆర్, కేటీఆర్ లు దమ్ముంటే చర్చకు రావాలని.. మురళీధరరావు అన్నారు. కేటీఆర్ కు చదువు ఎక్కువై ఉన్న మతి పోయిందన్న మురళీధరరావు కేసీఆర్ వలనే తెలంగాణ రాలేదని రాష్ట్ర ఏర్పాటులో భాజపా పాత్ర కీలకమని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: