పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఊహించని ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగుతున్నా.. కొన్ని కీలక స్థానాల్లో ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రధానంగా మంత్రి కొడాలి నాని, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి వారి సొంత గ్రామాల్లో టీడీపీ సత్తా చాటింది. గతంలో మంత్రిగా పని చేసి.. కొన్నాళ్ల క్రితం రాజ్యసభకు వెళ్లిన పిల్లి సుభాష్ చంద్రబోస్ సొంత నియోజకవర్గం రామచంద్రాపురంలోని  సొంత గ్రామం అసన్‌బాదలో వైసీపీ అభ్యర్థి మూడో స్థానంలోకి పడిపోయారు.  

ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచారు. అలాగే.. మంత్రి కొడాలి నానికి కూడా షాక్ తగిలింది.. కృష్ణా జిల్లాలోని కొడాలి నాని  సొంత గ్రామంలో టీడీపీ జెండా ఎగరేసింది. నాని సొంత ఊరు పెదపారుపూడి మండలం  యలమర్రు గ్రామం. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అనూష సర్పంచ్‌ గా గెలిచింది. అంతే కాదు.. పంచాయతీలోని  11 వార్డుల్లో టీడీపీ వాళ్లే గెలిచారు. వైసీపీ అభ్యర్థి కేవలం ఒక్క వార్డులోనే గెలిచారు.  అలాగే కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరులోనూ టీడీపీ సత్తా చాటింది.

మొత్తం మీద.. టీడీపీ పై విరుచుకుపడే వైసీపీ నేతలు సొంత గ్రామాల్లో మాత్రం గెలవలేకపోయారన్న అపకీర్తి ఈ ఎన్నికలతో మూటగట్టుకున్నారు. ఈ టీడీపీ విజయాలపై ఆ పార్టీ నేతలు పరమానందంగా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే  వైసీపీ కంచు కోటలు బద్దలయ్యాయని  టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ ఫలితాలు వెల్లడైన తర్వాత మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య, దేవినేని ఉమ.. ఇక వైసీపీకి డౌన్ ఫాల్ మొదలైందని చెబుతున్నారు.

వైసీపీ హహాకు అడ్డకట్టపడిందని.. ఇక ముందు కూడా ఇదే ఫలితాలు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ వాళ్లు మాత్రం ఒకటి రెండు చోట్ల వచ్చిన ఫలితాలు చూసి టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: