కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి పై చెడు ప్రభావం పడుతుందని కొందరు మగవారు భావిస్తూ టీకా వేయించుకోవడానికి విముఖత చూపుతున్నారు. దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు వ్యాక్సిన్ వల్ల మగసంతానోత్పత్తిపై చెడు ప్రభావం పడుతుందో లేదో తెలుసుకోవడానికి మియామీ యూనివర్సిటీ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన నిర్వహించేందుకు 45 మంది మగవారిని ఎంపిక చేసుకొని.. వ్యాక్సిన్ తీసుకోక ముందు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వారి సంతాన సామర్థ్యం లో ఎలాంటి మార్పులు వచ్చాయో పరిశీలించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 45 మంది వాలంటీర్లకు ఎంఆర్‌ఎన్‌ఏ (mRNA) వ్యాక్సిన్ల యొక్క రెండు డోసులు ఇచ్చిన తర్వాత పరిశోధకులు పరీక్షలు నిర్వహించారు.

అయితే ఆ పరీక్షలో ఏం తేలిందంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా.. వాలంటీర్లలో వీర్యకణాలు ఆరోగ్యకరమైన స్థాయిలోనే ఉన్నాయని తేలింది. దీంతో కరోనా వ్యాక్సిన్లు మగవారి సంతానోత్పత్తిని ప్రభావితం చేయవని సిద్ధాంతపరమైన అవగాహన కల్పించినట్లు అయ్యింది. ఈ మొట్టమొదటి అధ్యయనంతో వ్యాక్సిన్ ప్రభావాల గురించి తప్పుడు నమ్మకాలు పెట్టుకున్న వారి సందేహాలు తీరిపోయినట్టు కూడా చెప్పుకోవచ్చు.

ఈ స్టడీ కి సంబంధించి పీర్-రివ్యూ జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో ఒక నివేదిక ప్రచురించారు. "45 వాలంటీర్లలో 21 (46.7%) మంది BNT162b2 (ఫైజర్-బయోటెక్) టీకా డోసులు తీసుకోగా.. 24 (53.3%) మంది mRNA-1273 (మోడెర్నా) టీకా డోసులు తీసుకున్నారు. ఈ వాలంటీర్లకు టీకా ఇవ్వక ముందు వీర్యకణాల సాంద్రత ఒక్క మిల్లి లీటర్ కి 26 మిలియన్లు ఉంది. టిఎంఎస్సి అనగా మొత్తం మొబైల్ వీర్యకణాల కౌంట్ 36 మిలియన్లు ఉంది. ఐతే రెండు టీకా డోసులు తీసుకున్న తర్వాత మధ్యస్థ వీర్యకణాల సాంద్రత ఒక్క మిల్లి లీటర్ కి 30 మిలియన్లకు పెరిగింది. మధ్యస్థ టిఎంఎస్సి 44 మిలియన్లకు పెరిగింది. వీర్యం పరిమాణం, వీర్యకణాల చలనశీలత కూడా గణనీయంగా పెరిగింది, ” అని ఆ నివేదికలో పేర్కొనబడింది.

ఐతే ఈ పెరుగుదల సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. పరీక్షలు నిర్వహించే క్రమంలో వ్యవధి పెరగడం వల్ల వాలంటీర్ల లో సహజంగానే వీర్యకణాల సంఖ్య పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. దీనితో ఈ అధ్యయనం ఆధారంగా కరోనా వ్యాక్సిన్ల వల్ల మగ సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: