సోషల్ మీడియా.. పిచ్చివాడి చేతిలో రాయిగా మారుతోంది. భావప్రకటనకు ఉన్న మంచి అవకాశాలను కొందరు చేజేతులా దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాదు. పార్టీల పిచ్చితో.. కులాల పిచ్చితో.. మతాల పిచ్చితో ఇష్టానుసారం వాడుతున్నారు. అలా వాడటం ద్వారా కొందరు వివాదాల్లో చిక్కుకుని పోలీసులు కేసుల వరకూ వెళ్తున్నారు. కొందరు తెలిసీ తెలియక పోస్టులు పెట్టి జైలుపాలవుతున్నారు. అలాంటిదే ఈ సంఘటన.


ఏకంగా ముఖ్యమంత్రిని చంపుతానని సామాజిక మాధ్యమాల్లో బెదిరిస్తూ పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో జనసేన కార్యకర్త రాజుపాలెపు ఫణిను పోలీసులు  అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. సీఎంను మానవ బాంబుగా మారి చంపుతానని సదరు ఫణి సోషల్ మీడియాలో పెట్టాడట. ఆ తర్వాత ఆ పోస్టును సదరు ఫణి డెలిట్ చేశాడట. కన్నా భాయ్ అనే అకౌంట్ పేరుతో పోస్టులు పెట్టేవాడట. ఆ తర్వాత ఫోన్ స్విచాప్ చేసి హైదరాబాద్ వెళ్లాడట.


కానీ పోలీసులు ఊరుకుంటారా.. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పవన్ ఫణిని అరెస్టు చేశారు. ఇలా చట్ట విరుద్ధంగా పోస్టులు పెట్టే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చిరించారు. అయితే.. ఫణి.. తాను పవన్ కళ్యాణ్ అభిమాని అని, జనసేన మద్దతుదారునని తెలిపాడట. జనసేన మాత్రం.. తాము
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిని ఎప్పుడూ ప్రోత్సహించబోమని చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రిని చంపుతానని పోస్టు చేసిన వ్యక్తికి జనసేస పార్టీతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.


హింసను ప్రోత్సహించే, అశాంతిని కలిగించే, అసభ్యకర వ్యాఖ్యానాలు ఉండే పోస్టులను జనసేన పార్టీ ఎప్పుడూ ఖండిస్తుందని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సానుభూతిపరుడు... పార్టీ అధ్యక్షుల వారి అభిమాని అనే ముసుగులో తప్పుడు పోస్టులు చేసేవారిపట్ల జనసేన నాయకులు, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించాలని.. వాస్తవిక, విశ్లేషణాత్మక దృక్పథంతో, ఆలోచన కలిగించేలా, చైతన్య పరచే విధంగా జనసైనికుల పోస్టులు ఉండాలని జనసేన పార్టీ ఆకాంక్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: