మరో నెల రోజుల్లో పంజాబ్ లో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయం బాగా వేడెక్కింది. ప్రధాన పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూపై మాజీ సీఎం అమరీందర్‌ సింగ్ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాను సీఎంగా ఉన్న సమయంలో సిద్దూకు మంత్రి పదవి ఇవ్వాలని నేరుగా పాక్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ నుంచే లాబీయింగ్‌ వచ్చినట్టు అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. 



నవజోత్‌ సింగ్‌ సిద్ధూను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత.. ఒక ఉమ్మడి మిత్రుని ద్వారా అమరీందర్ సింగ్‌కు ఒక సందేశం వచ్చిందట. పాకిస్థాన్‌ ప్రధానికి సిద్ధూ పాత మిత్రుడనీ.. ఆయన కోరిక మేరకు సిద్ధూను తిరిగి కేబినెట్‌లో తీసుకోవాలన్నది ఆ సందేశం ఉద్దేశమట. అలా చేస్తే పాక్ ప్రధాని కృతజ్ఞతతో ఉంటారని.. ఒకవేళ మంత్రిగా సిద్ధూ సరైన పనితీరు కనపరచకపోతే అప్పుడు తొలగించాలని ఆ సందేశంలో పేర్కొన్నారట. అయితే.. ఈ విషయాన్ని అప్పుడే అమరీందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీల దృష్టికి తాను తీసుకువెళ్లారట. 



ఇప్పుడు అమరీందర్ సింగ్ బయటపెట్టిన అంశం రాజకీయంగా సంచలనం కలిగించే అవకాశం ఉంది. దేశ భద్రతతో కూడిన సున్నితమైన అంశం కావడంతో ఇది వివాదాస్పదం అయ్యే అవకాశం  ఉంది. సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు పంజాబ్‌ కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలు అనూహ్యంగా సీన్ మొత్తం మార్చేశాయి. వరుసగా కాంగ్రెస్‌ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన అమరీందర్‌ సింగే మూడోసారి కూడా సీఎం అభ్యర్థిగా ఉంటారని అంతా భావించినా.. అది సాధ్యం కాలేదు. 



పంజాబ్‌ పీసీసీగా సిద్దూకు అవకాశం ఇవ్వడం.. పార్టీలో తన ప్రాధాన్యం తగ్గడం అమరీందర్‌ను ఇబ్బంది పెట్టింది. ఈ పరిణామాలకు పరాకాష్టగా చివరకు సీఎం పదవి నుంచి తప్పించింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో పార్టీని వీడిన అమరీందర్ సింగ్.. ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకుని బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల బరిలో దిగుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: