ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు వచ్చేశాయి.. ఇప్పటికే ఉన్న 13 జిల్లాలకు తోడుగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఏపీలో పార్లమెంట్‌ స్థానానికి ఓ జిల్లా ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. దీన్ని ఇప్పుడు జగన్ సర్కారు అమలులోకి తెచ్చేసింది.


ప్రస్తుత జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాత పేర్లే ఉంచారు.. ఇప్పుడు కొత్తగా మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్‌, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కాకినాడ, అన్నమయ్య, శ్రీబాలాజీ జిల్లాలు ఏర్పాటయ్యాయి. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఉంటుంది. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంటుంది.  అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా ఏర్పాటైంది. కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా ఏర్పాటైంది.


ఇక అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటైంది. బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా..  నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా.. నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా.. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను... తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది.


వీటితోపాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల జిల్లా కేంద్రాలను మార్చారు. ప్రస్తుతం కాకినాడ కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాకు ఇకపై రాజమహేంద్రవరం కేంద్రంగా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకూ ఏలూరు కేంద్రంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ఇకపై భీమవరం కేంద్రంగా ఉండబోతోంది. ఈ నోటిఫికేషన్లపై 30 రోజుల్లోగా స్థానికుల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఈ జిల్లాలు పూర్తి స్థాయిలో ఖరారవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: