పార్లమెంట్ లో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చింది. రాజ్యసభ సభ్యులు కనకమేడల.. పవన్ కల్యాణ్ కొత్త సినిమా విడుదలను ప్రస్తావిస్తూ సీఎం జగన్ ని టార్గెట్ చేయాలనుకున్నారు. అయితే ఆయన అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. అసలు పార్లమెంట్ లో సినిమాల ప్రస్తావన, సినిమా హీరోల ప్రస్తావన ఎందుకంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాని అడ్డుకోడానికి ఏపీలో సినిమాల విడుదలపై ఆంక్షలు పెట్టారని, టికెట్ రేట్లు తగ్గించారనేది కనకమేడల ఆరోపణ. ఏపీలో సినీ ఇండస్ట్రీ పరిస్థితి బాగోలేదని ఆయన సినిమా వాళ్లకు సపోర్ట్ గా మాట్లాడారు. సీఎం జగన్ ని ఇరుకున పెట్టాలనుకున్నారు.


 

ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గడంతో దర్శక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే. అది ఎలాగూ తమ రెమ్యునరేషన్ పై ప్రభావం చూపిస్తుంది కాబట్టి.. హీరోలు కూడా ఈ విషయంలో కలుగజేసుకుంటున్నారు. ఈ క్రమంలో హీరోల పారితోషికాలపై సెటైర్లు పడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలోని కార్మికులపై అంత ప్రేమ ఉంటే, పారితోషికం తగ్గించుకోవచ్చు కదా అని రాజకీయ నాయకులు కామెంట్లు చేస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ విడుదల విషయంలో నిర్మాతలు కూడా అది తమ చేతిలో లేదని, ఏపీ సీఎం జగన్ ని అడగాలని స్టేట్ మెంట్ ఇవ్వడం మరింత సంచలనంగా మారింది.

ఏపీలో ప్రస్తుతం నైట్ కర్ప్యూ అమలులో ఉంది. సెకండ్ షో లకు పర్మిషన్ లేదు, టికెట్ రేట్లు ఆల్రడీ తగ్గించారు. దీంతో కొత్త సినిమాలు థియేటర్లలోకి తేవడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీస్ కి మాత్రం ఇది కచ్చితంగా సరైన టైమ్ కాదు. అందుకే భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ప్రకటించడానికి నిర్మాతలు ముందూ వెనకా ఆలోచిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించారు ఎంపీ కనకమేడల. దీంతో ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. ఎంపీగారు రాష్ట్రంలోని సమస్యలు మరచిపోయారని, కేవలం పవన్ ని ప్రసన్నం చేసుకోడానికే టీడీపీ అలా మాట్లాడిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: