హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ సమీకరణాలతో ఏపీలో అధికారపార్టీ నేతలు పిచ్చహ్యాపీగా ఉన్నారట. ఇదే సమయంలో ప్రతిపక్షాలైన తెలుగుదేశంపార్టీ, జనసేనలు మాత్రం అయోమయంలో  పడిపోయాయి. ప్రాంతీయపార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను కేసీయార్ జాతీయపార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన విషయం తెలిసిందే. జాతీయపార్టీని ప్రకటించగానే కేసీయార్ దృష్టి ముందుగా ఏపీపైనే పడింది. ఎందుకంటే కాంగ్రెస్, టీడీపీల్లో కేసీయార్ కు సన్నిహితులుగా ఉన్న నేతలు చాలామందున్నారు.





వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలకుండా జాగ్రత్తలు తీసుకుని జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనేది చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్లాన్. మరి వీళ్ళ ప్లానులో బీజేపీ ఇముడుతుందా లేదా అన్నది ఇప్పటికైతే స్పష్టతలేదు. అవసరమైతే టీడీపీ, జనసేనలు కలిసి పనిచేయటానికి కూడా రంగం సిద్ధమవుతోంది. తమ రెండుపార్టీలు కలిసి పోటీచేస్తే వైసీపీని ఓడించటం తేలికే అని చంద్రబాబు, పవన్ అనుకుంటున్నారు.





ఎందుకంటే మిగిలిన బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల ఓటుబ్యాంకు ఎంతుందో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలోనే ఏపీలో బీఆర్ఎస్ పోటీచేయటానికి రెడీ అవుతోంది. గెలుపోటములతో సంబంధంలేకుండా ఏపీలో పోటీచేయాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. తనతో పొత్తు పెట్టుకోవటానికి సిద్ధపడే పార్టీలు, తమ పార్టీలో చేరటానికి ఆసక్తిగా ఉన్న నేతలతో స్వయంగా కేసీయార్, టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.  ఈ లెక్కన కొన్ని నియోజకవర్గాల్లో అయినా బీఆర్ఎస్ తరపున పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులు దొరికితే కేసీయార్ కు అంతేచాలు. ఈ గట్టి అభ్యర్ధుల వల్ల బీఆర్ఎస్ కి పదే ఓట్లన్నీ టీడీపీ, జనసేనకు మైనస్ అనే చెప్పాలి.






బీఆర్ఎస్ తక్కువలో తక్కువ ఓ 50 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను రంగంలోకి దింపితే వాళ్ళకి పడే ఓట్లు టీడీపీ, జనసేనకు నష్టం చేయటం ఖాయం. టీడీపీ, జనసేనకు ఓట్లు మైనస్ అవటమంటే పరోక్షంగా వైసీపీకి ప్లస్సన్నట్లే. ఇందుకే వైసీపీ నేతలు పిచ్చహ్యాపీగా ఉన్నారట. మరి దీనికి విరుగుడుగా చంద్రబాబు, పవన్ ఏమాలోచిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: