
తెలుగుదేశంపార్టీతో పాటు లోకేష్ కు పెద్ద షాకనే చెప్పాలి. అరెస్టు నుండి తప్పించుకోవాలని ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న లోకేష్ కు హైకోర్టు పెద్ద షాకిచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కుంభకోణంలో సీఐడీ విచారణకు సహకరించాల్సిందే అని లోకేష్ ను ఆదేశించింది. సీఆర్పీసీ 41 ఏ కింద లోకేష్ కు నోటీసు జారీచేయాలని కోర్టు సీఐడీని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారమే ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఐడీ అధికారులు లోకేష్ ను కలిసి నోటీసులు జారీచేశారు.
ఎలాగూ నోటీసు జారీచేశారు కాబట్టి లోకేష్ విచారణకు హాజరుకాక తప్పదు. విచారణకు హాజరైన తర్వాత సీఐడీ లోకేష్ ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశముంది. విచారణలో లోకేష్ ఏమాత్రం సహకరించటంలేదని చెప్పి అరెస్టుకు సీఐడీ మళ్ళీ పిటీషన్ వేసే అవకాశముంది. ఆ పిటీషన్ ప్రకారం కోర్టు లోకేష్ అరెస్టుకు అనుమతించే అవకాశముంది. ఒకసారి అరెస్టయితే లోకేష్ కు జ్యూడిషియల్ రిమాండా లేకపోతే సీఐడీ కస్టడీయా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది.
కస్టడీ విచారణకు అనుమతించాలని సీఐడీ అడుగుతుంది కాబట్టి కోర్టు కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ఏకకాలంలో తండ్రి చంద్రబాబునాయుడు, కొడుకు లోకేష్ జైలులో ఉండక తప్పదు. స్కిల్ స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబు గడచిన 23 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే.
రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు ఏమాత్రం సహకరించలేదు కాబట్టి కస్టడీని పొడిగించాలని సీఐడీ ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఇదే పద్దతిలో లోకేష్ కూడా విచారణకు సహకరిస్తారనే నమ్మకం ఎవరిలోను లేదు. కాబట్టి సీఐడీ లోకేష్ విషయంలో కూడా అరెస్టు, కస్టడీ పిటీషన్లు వేయక వేరేదారిలేదు. మొత్తానికి గడచిన 15 రోజులుగా అరెస్టును తప్పించుకునేందుకు లోకేష్ ఢిల్లీలో కూర్చున్నాడన ప్రచారం మరో రూపంలో తీరబోతోంది. మరి విచారణకు హాజరు అవ్వాలి కాబట్టి లోకేష్ వెంటనే ఢిల్లీ నుండి ఏపీకి తిరిగిరాక తప్పదు. మరి ఎప్పుడొస్తాడో చూడాలి.