ఆంధ్రాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అత్యంత ఘోరంగా ఓటమి పాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఓటమికి గల కారణాలను అనేకమంది విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ కీలక నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఘోర పరాజయానికి గల కారణాలను చెప్పుకొచ్చారు. సుమారుగా గడిచిన రెండు వారాల నుంచి కార్యకర్తలు, నాయకులు వచ్చి తనను కలుస్తూ ఇంత అభివృద్ధి, సంక్షేమం చేసినా కూడా ఎందుకు ఓడిపోయామని అడుగుతున్నారని, దానికోసమే ఈ విషయాలు చెబుతున్నానని ఓ వీడియో విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "రాజకీయాల్లో గెలుపోటములు అనేవి చాలా సర్వసాధారణం. గెలుపుని ఏ విధంగా తీసుకుంటామో ఓటమిని కూడా అదే విధంగా స్పోర్టివ్ గా తీసుకోవాలి. ప్రతిపక్ష పాత్ర ఉన్నా లేకపోయినా మనం నిర్వర్తించాల్సిన సంప్రదాయాలను హుందాగా నిర్వర్తించాలి. ఓడిపోవడానికి ప్రధానంగా రెండు మూడు కారణాలు ఉన్నాయి. సంక్షేమం అద్భుతంగా జరిపించినా లోపలు అయితే లేవని చెప్పలేము. ముఖ్యంగా మద్యం విషయంలో ప్రభుత్వానికి బాగా చెడ్డపేరు వచ్చింది. ఇదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికీ అనేసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది.

వాస్తవానికి రోజూ కనీసం 20 నుంచి 25 శాతం మంది మద్యం తాగుతారు. వారంతా డబ్బులు ఎక్కువ వెచ్చించి మరీ నాసిరకం మద్యాన్ని తాగేవారు. ఇదే సమయంలో... ఇసుక మీద ఆధారపడేవాళ్లు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఈ రకంగా కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో మద్యం, ఇసుక పాలసీ అనేవి బాగా దెబ్బకొట్టాయి. వీటన్నిటితో పాటు మరీ ముఖ్యంగా నాడు జగన్ పార్టీ పెట్టడానికి, వైసీపీ అధికారంలోకి రావడానికి.. నేడు చంద్రబాబు గెలవడానికీ ఒకటే కారణం. అది అవమానం. అవును, అదే మనిషిలో కసిని పెంచుతుంది. ఇందులో భాగంగా నాడు వైఎస్ జగన్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించి జైల్లో పెడితే వైసీపీ కార్యకర్తల్లో కసి పెరిగింది. అదే విధంగా చంద్రబాబుని జైల్లో పెట్టడాన్ని టీడీపీ కార్యకర్తలు అవమానంగా భావించి.. కసితో పనిచేసారు. ఫలితంగా బాబు అద్భుతమైన ఫలితాన్ని చూసారు. ఇక అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ కలయిక ఒక చరిత్ర సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. అన్నింటికంటే అదే పెద్ద లాస్ ని మాకు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: