ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రావడంతో పదవులు ఆశించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వైసీపీ నేతలు నామినేటెడ్ పదవులకు ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పొత్తు వల్ల సీట్లను త్యాగం చేసి పార్టీ కోసం పని చేసిన వాళ్లకు చంద్రబాబు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బొడ్డు వెంకటరమణ రెండేళ్ల క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
 
రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. అయితే పొత్తులో భాగంగా జనసేనకు ఈ టికెట్ కేటాయించగా బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాజానగరం స్థానం బత్తులకు కేటాయించే ముందే బొడ్డు వెంకటరమణకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సరైన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
 
బొడ్డు వెంకట రమణ తండ్రి బొడ్డు భాస్కర రామారావు గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పని చేశారు. ఎమ్మెల్సీ పదవి లేదా కార్పొరేషన్ ఛైర్మన్ పదవులలో ఏదో ఒక పదవి బొడ్డు వెంకటరమణకు దక్కే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. బొడ్డు వెంకటరమణ జనసేన అభ్యర్థి బత్తుల గెలుపు కోసం సైతం ఎంతో కష్టపడ్డారు. పోటీ చేసే అవకాశం దక్కకపోయినా పార్టీనే నమ్ముకున్నారు.
 
వైసీపీ నుంచి టీడీపీలో చేరి పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించిన బొడ్డు వెంకటరమణ కీలక పదవి ఇస్తే మాత్రమే టీడీపీ పూర్తిస్థాయిలో న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పవచ్చు. చంద్రబాబు నామినేటెడ్ పోస్టులను వీలైనంత వేగంగా భర్తీ చేస్తే బాగుంటుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమిని నమ్ముకుని ఎక్కువ సంఖ్యలో నేతలు ఉండటంతో పార్టీ కోసం కష్టపడిన ప్రతి నేతకు న్యాయం చేయాల్సిన బాధ్యత బాబుపై ఉంది. త్వరలో చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: