ఎన్నికల్లో ఓడిపోయిన నెలరోజులకే వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీలో మరో చీలిక తప్పదా..? ఇప్పటికే కడప ఎంపీ సీటు వైఎస్ఆర్ ఫ్యామిలీని రెండు ముక్కలుగా చేసింది. ఇప్పుడు అదే ఎంపీ సీటు మూడు ముక్కలుగా చేయబోతుందా..? అంటే అవుననే ప్రచారం కడప రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. కడప ఎంపీగా పోటీ చేస్తారని కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై వైసీపీ వర్గాలు అయితే క్లారిటీ ఇవ్వటం లేదు. కడప ఎంపీగా జగన్ పోటీ చేస్తే ఆ పదవీలో ప్రస్తుతం కొనసాగుతున్న అవినాష్ రెడ్డి తప్పకుండా రాజీనామా చేయాలి.


అయితే అవినాష్ రెడ్డి తన ఎంపీ పదవీకి రాజీనామా చేసేందుకు ఒప్పుకుంటారా..? అన్నది స్థానికంగా వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న సందేహం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు తనకు పెద్ద రక్షణ కవచం అని అవినాష్ రెడ్డి బలంగా భావిస్తున్నారు. అయితే జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠం చేజారింది. అసెంబ్లీలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. పైగా అక్రమ అస్తుల కేసులు జగన్‌ను బాగా భయపెడుతున్నాయి. ఈ కేసుల్లో కేంద్రాన్ని మేనేజ్ చేసుకునేందుకు.. పార్లమెంట్‌కు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్న అవినాష్ రెడ్డి.. ఎంపీ పదవి కూడా పోతే మరిన్ని చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. గత ఎడాది సిబిఐ అరెస్టు చేసినప్పుడు తాను ఎంపీగా ఉన్నానని.. ప్రజల కోసం పోరాడాల్సి ఉంటుందని బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు జగన్మోహ‌న్‌ రెడ్డి ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి తన ఎంపీ పదవి వదులుకుంటే.. రేపు తన పరిస్థితి ఏంటి..? అని అవినాష్ రెడ్డి.. జగన్మోహ‌న్‌ రెడ్డిని ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా కడప ఎంపీగా జగన్ పోటీ చేయాలని నిర్ణయించుకుంటే అవినాష్ రెడ్డి తన అవసరాల దృష్ట్యా జగన్‌ను ఎదిరించిన ఆశ్చర్యపోనవసరం లేదని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే వైఎస్ ఫ్యామిలీ మూడు ముక్కలు కావటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: