పక్క వాళ్ళు చేస్తే తప్పు.. మనం చేస్తే అది తప్పు కాదు. ప్రస్తుతం రాజకీయ నాయకుల తీరు ఈ విధంగానే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ తప్పు చేసినా అది తప్పు కాదు . కానీ అదే అధికారం కోల్పోయిన తర్వాత, అధికార పార్టీ వాళ్ళు చేస్తే అది పెద్ద తప్పు అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాలపాటు కేసీఆర్ పాలన నడిచింది. ఈయన హయాంలోనే ఎంత అభివృద్ధి జరిగిందో అంతే నైతికత లేని పనులు కూడా చేశారు. తొమ్మిది సంవత్సరాలపాటు కనీసం ప్రతిపక్షం అనే పదాన్ని వినిపించకుండా ఎక్కడికక్కడ ఒత్తి పడేశారు. అలాంటి బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం అధికరాన్ని కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ రాజ్యాంగ విరుద్ధంగా తప్పులు చేస్తోందని మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు. 

అయితే అసలు కాంగ్రెస్ తప్పు చేస్తుంది అనడానికి ముందు వాళ్ళని వాళ్ళు ముందుగా తప్పు పట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి టిడిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్పించుకొని ఏకంగా మంత్రి పదవులు అందించారు. కనీసం ప్రతిపక్ష హోదా ఉండాలనే ఆలోచన కూడా చేయకుండా మొత్తానికి మొత్తం పార్టీలో విలీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అలా 9 సంవత్సరాల పాటు పాలన సాగించిన కేసీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో అడుగు పెడితే  నైతికత విలువలు అంటూ మాట్లాడుతున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా చాలా విడ్డూరంగా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతూ కాంగ్రెస్ కండువాలు వేసుకుంటున్నారని, ఇదేంటి అని అడిగితే అది మన జాతీయ జెండా కండువా అంటూ చెప్పుకొస్తున్నారని, అంతేకాదు ఆ ఎమ్మెల్యేలను వీళ్లు పులింగమా, స్త్రీ లింగమా అసలు వీళ్ళు ఏ లింగమో చెప్పాలంటూ దారుణంగా విమర్శించారు. నిజానికి రాష్ట్రంలో ఇలాంటి పనులకు ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇలా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: