
అసలు ఈ వ్యవహారాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) పరిధికి ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు, టిడిపి నాయకులు సైతం ఈ డిమాండ్‌ను గతంలో బలంగా ఉంచారు. కానీ కేంద్రం స్పందించకపోవడం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ పదే పదే “ఎలాంటి దర్యాప్తుకైనా సిద్ధమేనని” చెప్పినా కేంద్రం మాత్రం ఈ కేసుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక ఛత్తీస్గఢ్ ఉదాహరణ తీసుకుంటే, అక్కడ కూడా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి. సుమారు 2000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌పై ప్రస్తుతం సిబిఐ, ఈడి దర్యాప్తు చేస్తూ, మాజీ సీఎం భూపేష్ బగల్ కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు.
అక్కడ బీజేపీ ప్రభుత్వం మారిన వెంటనే కేంద్ర సంస్థలు చురుకైన చర్యలు చేపట్టాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేంద్రం మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక ఈ అంశంపై కథనం ప్రచురించింది. దాని ప్రకారం, సుమారు ఏడాది క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐ, ఈడీకి అప్పగించేందుకు సిద్ధమైనా కేంద్రం నుంచి అనుమతి రాలేదని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి కీలక నేతలతో జగన్‌కు ఉన్న సాన్నిహిత్యం వల్లే ఈ నిర్ణయం ఆగిపోయిందని ఆ కథనం స్పష్టం చేసింది.
దీంతో, ఇకపై ఈ కేసు రాష్ట్ర దర్యాప్తు సంస్థల పరిధిలోనే కొనసాగి తేల్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే, కేంద్రం జోక్యం లేకపోవడం వల్ల నిజానికి లబ్ధిదారు ఎవరు? అసలు ఈ వ్యవహారం ఎప్పుడు తేలుతుంది? అన్న సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. మొత్తానికి, సిబిఐ–ఈడి విచారణలు లేకపోవడానికి ప్రధాన కారణం “కేంద్రం ఒప్పుకోకపోవడమే” అన్నది తాజాగా వెలుగులోకి వచ్చిన కీలక అంశం.