హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం రానున్న ఉపఎన్నికతో రాజకీయంగా హాట్‌స్పాట్‌గా మారింది. ఈ నెల 13 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు తమ బలం, వ్యూహాలను పరీక్షించుకునే రంగంగా ఈ నియోజకవర్గాన్ని చూస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతను ప్రదర్శించడానికి, తమ స్థిరబలం ఏమిటో నిరూపించుకోవడానికి ఈ ఎన్నికను అవకాశంగా మార్చుకోవాలని ఆలోచిస్తోంది.


ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దించాలని యోచిస్తోంది. ఈ జాబితాలో తన పేరును చేర్చాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా పట్టుబట్టినట్లు సమాచారం. ఆమె ఈ అంశంపై పార్టీ హైకమాండ్‌కి లేఖ రాసినట్టు తెలుస్తోంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ ప్రతిపాదనపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. షర్మిల ప్రచారం వల్ల పార్టీకి మేలు కాకపోవచ్చని, బదులుగా నష్టం జరిగే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.


జూబ్లీహిల్స్ వంటి పట్టణ నియోజకవర్గంలో తటస్థ ఓటర్లు కీలకం. షర్మిల ప్రచారంలో పాల్గొంటే ఆ వర్గం దూరమవుతుందనే ఆందోళన కొందరిలో కనిపిస్తోంది. అంతేకాక తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రభావం చాలా పరిమితంగానే ఉందన్న వాస్తవాన్ని వారు గుర్తుచేస్తున్నారు. గతంలో ఆమె తెలంగాణ కోడలుగా ప్రచారం చేసుకున్నా ప్రజల్లో పెద్దగా ఆదరణ దక్కలేదు. ఆమె స్థాపించిన పార్టీకి కూడా పెద్దగా స్పందన రాలేదు.
ఇక స్థానిక నేతలు మరో కోణంలో ఆలోచిస్తున్నారు. ఏపీలో ఆమెకు ఉన్న రాజకీయ బాధ్యతల నేపథ్యంలో ఆమెను తెలంగాణ రాజకీయాల్లో భాగం చేయడం సరికాదని భావిస్తున్నారు. ఆమె ఇక్కడ ప్రచారం చేస్తే బిఆర్ఎస్‌కు రాజకీయ ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.


అయినా షర్మిల మాత్రం తెలంగాణలో తాను వైఎస్ వారసురాలిగా గుర్తింపు పొందాలనే ఆశతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక నాయకత్వం మాత్రం ఈ సమయంలో ఆమె అవసరం లేదని స్పష్టంగా తెలిపిందని సమాచారం. ఇప్పుడు ఈ అంశంపై చివరగా సీఎం రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: