
సత్తెనపల్లి టిక్కెట్ తమ రాజకీయ ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చేయడంతో కుటుంబం తీవ్రంగా అసంతృప్తి చెందింది. రాయపాటి సాంబశివరావు 1982లో 39 ఏళ్ల వయసులోనే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆయన రాజకీయాల్లో శక్తివంతమైన ప్రస్థానం కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1996, 1998, 2004, 2009 సంవత్సరాల్లో పార్లమెంటుకు గెలిచారు. ఆయన కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరారు. 2014లో నరసరావుపేట నుండి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. ఆ తరువాత నుంచి ఆయన కుటుంబం రాజకీయంగా పెద్దగా యాక్టివ్ కాలేదు.
ఇటీవలి సంవత్సరాల్లో రాయపాటి సాంబశివరావుకు వృద్ధాప్యం, అనారోగ్యం ఇబ్బందిగా మారాయి. అందుకే రాజకీయ వారసులను ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ టీడీపీ లావు శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట టిక్కెట్‌తో పోటీ చేయించడంతో రంగారావు నిరాశతో పార్టీకి రాజీనామా చేశారు. ఒకప్పుడు గుంటూరు పాలిటిక్స్‌ను శాసించిన రాయపాటి కుటుంబం ప్రస్తుతం రాజకీయ ప్రభావాన్ని కోల్పోయింది. కొత్త తరం నేతలు రంగంలోకి రావడంతో కుటుంబం వెనుకబడిపోయింది. అయినా కూడా రాజకీయాల్లో ఈ కుటుంబానికి ఉన్న చరిత్ర, అనుభవం మాత్రం చిన్నది కాదు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే - రాయపాటి కుటుంబం ఎన్నికల ముందు మరో పార్టీలో చేరుతుందా? లేక సైలెంట్ గానే ఉండిపోతుందా? అన్నది. గుంటూరు రాజకీయ సమీకరణాల్లో ఈ కుటుంబం తీసుకునే నిర్ణయం కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.