ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో, భక్తుల మధ్య తీవ్ర దుమారం రేపింది. కోట్లాది మంది విశ్వాసాన్ని నిలుపుకోవాల్సిన టీటీడీలో... ప్రసాదం తయారీ కోసం అసలు నెయ్యికి బదులు నాసిరకం, కల్తీ సరకును వాడటం దేవుడిపై, భక్తులపై చేసిన ఘోర ద్రోహంగా పరిగణించాలని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీఐడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే ఈ కేసులో 10 మందిని అరెస్టు చేసి జైలుకు పంపగా, వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా శనివారం మరో 11 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. వీరిలో 9 మంది తిరుమల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులే కావడం విస్తుగొలిపే అంశం. ఆలయ పోటు అధికారుల నుంచి స్టోర్ అధికారి దాకా ఉన్నత స్థానాల్లో ఉన్న వారే ఈ నెయ్యి మాఫియాలో పాలుపంచుకున్నారని తెలుస్తోంది.
ఇక ఈ దారుణానికి పాల్పడినవారి వివరాలతో కూడిన చార్జి మెమోను పోలీసులు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది. ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కోట్ల మంది నమ్మకాన్ని దెబ్బతీసి, శ్రీవారి ప్రసాదాన్ని కలుషితం చేసిన ఈ నిందితులందరికీ కఠిన శిక్ష పడాల్సిందేనని భక్తులు, ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య... భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేవారికి ఒక గుణపాఠం కావాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి