తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం కేసీఆర్ చేసిన విమర్శలకు, సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో  మీడియాఇష్టాగోష్టి  లో కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేసీఆర్ చావును తాను కోరుకుంటున్నాననే ఆరోపణలను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. "ఆయన కాలు విరిగినప్పుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, మంచి వైద్యం అందేలా చూసింది నేనే. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీలో జరిగే చర్చలకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని రేవంత్ పేర్కొన్నారు. ఆయన మరణిస్తే తనకు వచ్చే లాభమేమిటో చెప్పాలని, తనపై వస్తున్న విమర్శలలో అర్థం లేదని కొట్టిపారేశారు.


కేసీఆర్ కంటే ఆయన కుటుంబ సభ్యుల నుంచే ఆయనకు ముప్పు ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే తాను ముఖ్యమంత్రి అయిపోతానని కేటీఆర్ కొత్త బట్టలు కుట్టించుకున్నారని, కానీ కేసీఆర్ ఆ పదవి ఇవ్వరని తాను అప్పుడే చెప్పానని గుర్తు చేశారు. కేటీఆర్ ఒక 'ఐరన్ లెగ్' అని, ఆయన నాయకత్వంలో పార్టీ ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని ఎద్దేవా చేశారు. హరీష్ రావు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని రేవంత్ తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలను హరీష్ లాక్కోవాలని చూస్తున్నారని, ఆయన వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు.


బీఆర్ఎస్ ఆస్తుల ప్రస్తావనపై హరీష్ రావు పార్టీని వీడకపోవడానికి గల కారణాన్ని రేవంత్ విశ్లేషిస్తూ పార్టీ ఆస్తుల గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి రూ. 1,500 కోట్ల బ్యాంకు నిల్వలు, రూ. 3,500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, ఇక బయటకు కనిపించని వజ్ర వైఢూర్యాల సంగతి తెలియదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తర్వాత ఈ వేల కోట్ల ఆస్తిని దక్కించుకోవడమే హరీష్ రావు లక్ష్యమని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వాడిన భాష ఆయన వయసుకు తగినది కాదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. "ఆయన తమలపాకుతో కొడితే నేను తలుపు చెక్కతో దంచుతాను" అంటూ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: