ఒంగోలు రాజకీయాలు అంటేనే ఎప్పుడూ హీట్, ఎప్పుడూ హై వోల్టేజ్. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జన్మించిన గడ్డ ఇది. అలాంటి చరిత్ర ఉన్న జిల్లాలో రాజకీయాలు నిశ్శబ్దంగా సాగుతాయంటే నమ్మలేం. గుంటూరుకు ఆనుకుని ఉన్న ఈ జిల్లాలో అధికార–విపక్షాల మధ్య పోరు ఎప్పటికీ ఉగ్రంగానే ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా నడిచిన ఫైట్, కాలక్రమేణా టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. ఇప్పుడు జనసేన కూడా బలంగా ఎంట్రీ ఇచ్చి, ఒంగోలు రాజకీయాలను ట్రయాంగిల్ ఫైట్‌గా మార్చేసింది. ఈ పరిణామాల్లో వైసీపీ తన కోల్పోయిన రాజకీయ స్థలాన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నంలో ఉందన్న టాక్ వినిపిస్తోంది.


కొమ్ము కాసిన వాసన్న :
1989 తర్వాత ఒంగోలు రాజకీయాల్లో కొత్త తరం నాయకులు తెరపైకి వచ్చారు. వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. వైఎస్సార్‌కు దగ్గరి బంధువైన బాలినేని, దూకుడు రాజకీయాలతో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన హవా కొనసాగింది. అయితే 2019లో మంత్రిపదవి ఇచ్చి, మధ్యలోనే తొలగించడంతో ఆయనలో అసంతృప్తి పెరిగింది. 2024 ఎన్నికల్లో ఓటమి అనంతరం రాజకీయ దిశ మార్చుకుని జనసేనలో చేరారు. దీంతో “ఒంగోలులో వైసీపీకి పెద్ద దిక్కు ఎవరు?” అన్న ప్రశ్న ఇప్పటికీ సమాధానం లేకుండా ఉంది.


అనేక పేర్లు… ఒకే లక్ష్యం :
ఈ ఖాళీని పూడ్చేందుకు వైసీపీ ఎన్నో పేర్లను పరిశీలించింది. ఒక దశలో ఆమంచి కృష్ణమోహన్ పేరు గట్టిగా వినిపించింది. కానీ ఆ ప్రయత్నం ఎంతవరకు వెళ్లిందో స్పష్టత లేదు. ఇప్పుడు మాత్రం ఒక బిగ్ మూవ్‌పై వైసీపీ ఫోకస్ పెట్టిందన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని పార్టీలోకి తీసుకొస్తే జిల్లాలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. మాగుంట కుటుంబం కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ… అన్నీ చూసిన అనుభవజ్ఞులే. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన మాగుంట, ప్రస్తుతం టీడీపీ నుంచి అదే పదవిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను రాజకీయాల నుంచి తప్పుకుని కుమారుడిని వారసుడిగా నిలబెట్టాలని ఆయన భావిస్తున్నారన్న టాక్ ఉంది. ఇదే వైసీపీకి అవకాశంగా కనిపిస్తోందట. రాఘవరెడ్డిని తమవైపు తిప్పుకుంటే, జిల్లాలో ఆటను పూర్తిగా మార్చేయవచ్చని పార్టీ అంచనా.



బిగ్ షాట్‌తో బిగ్ గేమ్ :
మాగుంట ఫ్యామిలీకి జిల్లాలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు ఉంది. అందుకే రాఘవరెడ్డిని ఎంపీగా కాకుండా ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దించాలన్న ఆలోచన కూడా వినిపిస్తోంది. అయితే ఒంగోలు అంటే బాలినేని పేరు మళ్లీ గుర్తుకు వస్తుంది. జనసేనలో ఉన్న బాలినేని అదే సీటు కోరితే, పోరు మరింత రసవత్తరమవుతుంది. అప్పుడు వైసీపీకి మాగుంట ఫ్యామిలీ ట్రంప్ కార్డ్ అవుతుందా? అన్నదే ఇప్పుడు ఒంగోలు రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ. ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉన్నా… ఒంగోలు రాజకీయాలు మాత్రం ఇప్పుడే మంట పుట్టిస్తున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: