హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ నుంచి క్రిష్ణ డెల్టాకు నీటిని విడుదల చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో హర్షం వ్యక్తమవుతుండగా...డెల్టా ప్రాంతంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకుని డెల్టాకు నీళ్లందించకపోతే తామంతా క్రాప్ డాలిడేను ప్రకటిస్తామంటూ ఆ ప్రాంత రైతుల పక్షాన వివిధ పార్టీల నాయకులు అల్టిమేటం ఇచ్చారు. ముఖ్యంగా టీడీపీ పార్టీకి చెందిన నాయకులు మాత్రం మరో అడుగు ముందుకేసి హైకోర్టు ఆదేశాలను ధిక్కరించే విధంగా మాట్లాడుతున్నారు. సాగర్ నుంచి వెంటనే నీటిని పునరుద్దరించకపోతే తమ తడాఖ చూపిస్తామంటూ హెచ్చరికను జారీ చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి క్రిష్ణ డెల్టాకు ఇటీవలనే నీళ్లను వదిలిపెట్టారు. తెలంగాణ ప్రజల గొంతును ఎండగడుతూ ఆంధ్రకు నీళ్లను తరలించడంపై టీఆర్ఎస్ ఆందోళనే చేస్తోంది. మరోవైపు దీనిపై వెంకట్ రెడ్డి అనే రిటైర్డు చీఫ్ ఇంజినీర్ వ్యక్తి రాష్ర్ట హైకోర్టును ఆశ్రయించారు. సాగర్ ప్రాజెక్టులో510అడుగులకంటే దిగువస్థాయిలో ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లో నీటిని విడుదల చేయవద్దంటూ న్యాయస్థానం రాష్ర్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అంతే కాకుండా, నీటిమట్టం స్థాయికి సంబంధించిన వివరాలను రెండువారాల్లో తమకు నివేదికను ఇవ్వాల్సిందిగా కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఇప్పుడు దీనిపై డెల్టా ప్రాంత రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నారుమళ్లు, తాగునీటి కోసమనీ క్రిష్ణడెల్టాకు సాగర్ నుంచి నీటి విడుదల చేస్తే రైతాంగమంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. తెలంగాణ ప్రాంత ప్రజల గొంతెండపెట్టి, డెల్టాప్రాంతానికి నీటిని విడుదల చేయడం పట్ల తెలంగాణ రాష్ర్ట సమితి గత కొన్ని రోజులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నల్గొండ, ఖమ్మం ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్రంగా నష్టపోతారనీ టీఆర్ఎస్ వాదన. ఇదే విషయమై రిటైర్డు చీఫ్ ఇంజినీర్ వెంకట్ రెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజలకు సాగునీరు అందించే సాగర్ ఎడమ కాలువ నుంచి నీటి విడుదలకు 520అడుగుల షరతును విధించిన సర్కార్...కుడికాలువ కింద సాగయ్యే గుంటూరు, ప్రకాషం జిల్లాల కోసం 502అడుగుల షరతూనే విధిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం502అడుగులకు పైగానీట నిల్వ వుందనే కారణంతో డెల్టాకు కుడి కాలువ ద్వారా సర్కార్ నీటిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం గత రెండు వారాల కిందట నీటిని వదలిపెట్టారు. దీని వల్ల 520అడుగుల నీటి మట్టం చేరిందనీ,తద్వారా నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రాంత ప్రజలకు తీరనీ అన్యాయం జరగుతోందనీ వెంకట్ రెడ్డి తదితరులు హైకోర్టులు పిటీషన్లు దాఖలు చేశారు. ప్రత్యేక ఆంధ్ర, హైదరాబాద్ రాష్ర్టాలున్నప్పుడు నీటి విడుదలకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టావతరణ తరువాత ఒప్పందాలను విరుద్దంగా వ్యవహారించడం వల్ల తెలంగాణ ప్రజలకు తీరనీ అన్యాయం జరుగుతోందనీ అటు తెలంగాణావాదులు, ఇటు పిటీషనర్ల వాదన. భవిష్యత్ లో525అడుగుల నీటిమట్టం చేరేవరకు నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా పిటీషనర్లు కోర్టును కోరారు. హైకోర్టు ఆదేశాలతో డెల్టా ప్రాంతానికి వదలిపెడుతున్న నీటిని తాత్కాలికంగా నిలిపివేశారు.  ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం డెల్టా ప్రాంత రైతాంగానికి వరినాళ్ల కోసమే నీటిని విడుదల చేసిందనీ,ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదనీ డెల్టా ప్రాంత రైతులు, రాజకీయ పార్టీల నాయకులంటున్నారు.తెలంగాణ ప్రాంతానికి చెందినవాళ్లు మాత్రం రాష్ర్ట ప్రభుత్వం సీమాంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి డెల్టాకు నీటిని విడుదల చేసిందంటున్నారు. దీనిని డెల్టా ప్రాంత నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని డెల్టా ప్రాంతానికి విడుదల చేసిన నీళ్లను తిరిగి వెంటనే వదలకపోతే క్రాప్ హాలిడే ప్రకటించడమే కాకుండా, ఆందోళనను ఉధ్రుతం చేస్తామనీ తాజాగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ రాష్ర్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  మొత్తానికి సాగర్ నీళ్ల వ్యవహారం మరోమారు తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాల మధ్య చిచ్చును రగిల్చే సూచనలే కనిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు ఒక ప్రాంతంలో ఆనందాన్ని నింపుతుండగా, మరో ప్రాంతంలో ఆందోళనలకు కారణమవుతోంది. నీళ్ల యుద్ధం తప్పేటట్లు కనిపించడం లేదు. నీటిని విడుదల చేస్తే తెలంగాణలో చేయకుంటే సీమాంధ్రలో ఆందోళనలకు రాజకీయ పక్షాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: