హైదరాబాద్: ‘నవ్వెటోడి ముందు జారి పడ్డ’ చందంగా తయారైంది తెలంగాణ ఉద్యమ రథసారధుల తీరు. తెలంగాణ ఉద్యమానికి రెండు కళ్లుగా అందరూ భావిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్-తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాంరెడ్డి ఎడ ముఖం, పెడ ముఖంగా ఉంటున్నారు. వీరి తీరు చూసి తెలంగాణేతరులు తెగ సంబరపడిపోతున్నారు. వారిలో వారు కొట్లాడుకోవడం తెలంగాణేతరులకు ఎనలేని సంతోషాన్ని ఇస్తోంది. తెలంగాణ ఉద్యమ రథసారధులమనీ చెప్పుకునే వాళ్లకు మాత్రం సోయి వచ్చినట్లు లేదు. గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మాటా, ముచ్చట్లన్నీ బందయ్యాయి. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరినట్లు తెలంగాణేతర శక్తులు కోడై గూస్తున్నాయి. మనస్పర్ధలు ముదిరి పాకానపడ్డాయి. వీరిద్దరి మధ్య వచ్చిన విబేధాలను తొలగించడానికి ఉద్యోగ సంఘాల నేతలు, కొందరు తెలంగాణవాదులు, టీఆర్ఎస్ నాయకుడొకరు చేసిన ప్రయత్నాలు వికటించాయి. అయితే, తన మాట వినకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న జేఏసీ ఛైర్మన్ కోదండరాంను ఆ పదవి నుంచి తప్పించడానికి కేసీఆర్ స్కెచ్ కూడా వేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దీంతోనే ఇటివలి కాలంలో వీరద్దరు కలుసుకున్న దాఖలాలు లేవంటున్నారు. రాజకీయ జేఏసీ తలపెట్టిన తెలంగాణ మార్చ్ కార్యక్రమాన్ని తనకు తెలియకుండా ప్రకటించడం కూడా కేసీఆర్ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. కోదండరాంను జేఏసీలో ఏకాకిగా చేసి పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో ఇటీవలనే పదవీ విరమణ చేసిన స్వామిగౌడ్‌ను నియమించే విధంగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, కేసీఆర్ తీరుపై కోదండరాం వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా కేసీఆర్‌కు ధీటుగానే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే రెండ్రోజుల కిందట బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ ఎట్లొస్తది రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణకు సంబంధించిన అన్నిసంఘాలు వచ్చేలా చేశారు. ఈ వేదిక నుంచి కోదండరాం కూడా కాస్త ఘాటుగానే మాట్లాడారు. ఉద్యమంలో ఎవరి పంతా వారికి ఉండవచ్చు, గమ్యం మాత్రం ఒక్కటేనంటూ చురకలంటించారు. కోదండరాంను ఒంటరి చేయాలనుకుంటున్న కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ తహతహలాడుతోంది. టీజేఏసీ ఇచ్చే కార్యక్రమంలో తామంతా పాల్గొంటామంటోంది.
టీ జేఏసీలో టీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు బీజేపీ వ్యవూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనిని కోదండరాం కూడా తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, స్వామిగౌడ్ పదవీ విరమణ కార్యక్రమానికి కోదండరాంను ఆహ్వానిస్తే తాను రాననీ కేసీఆర్ తెగేసీ చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఏరి కోరి జేఏసీ ఛైర్మన్ చేస్తే కోదండరాం తనపై పెత్తనం చేసే విధంగా వ్యవహారించడం పట్ల కేసీఆర్ తీవ్ర అసంత్రుప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనతో సంప్రదించకుండానే కార్యక్రమాలు ప్రకటించడం పట్ల కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య తీవ్ర అగాధం పెరిగనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్-కోదండరాంల ఆధిపత్య పోరు వల్ల తెలంగాణవాదులు నలిగిపోతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు తెలంగాణేతరులు శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే, కేసీఆర్-కోదండరాంలు మాత్రం వారికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. తెలంగాణ రథసారధులే తెలంగాణ ఉద్యమానికి తూట్లు పొడిచే విధంగా, ఉద్యమం నీరుగారిపోయే విధంగా వ్యవహారిస్తున్నారంటూ తెలంగాణవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి మధ్యన ఏర్పడ్డ గ్యాప్ వల్ల తెలంగాణ ఉద్యమ ఎటు వైపు దారి తీస్తుందోననీ తెలంగాణవాదులు ఆందోళన చెందుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: