హైదరాబాద్: జ్యూడీషియల్ రిమాండు ముగిసిన జగన్ ను జైలు అధికారులు మరలా సోమవారం నాడు నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. జగన్ కు తిరిగి ఈ నెల 25వరకు జ్యూడీషియల్ రిమాండును విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో గత నెల 27న సీబీఐ అధికారులు విచారణకు పిలిచి అరెస్టు చేసిన విషయమే. 27న అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అదే నెల 28న నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరు పర్చగా జగన్ కు అక్కడి న్యాయస్థానం 14రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండు విధించిన విధితమే. న్యాయస్థానం విధించిన జ్యూడీషియల్ రిమాండు ముగియడంతో ఆయనను తిరిగి న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. న్యాయమూర్తి హాజరుపర్చే సమయంలో పోలీసులు సాధారణ ఖైదీ మాదిరిగా ఒక వ్యాన్లో తరలించారు. ఇదే విషయమై జగన్ కోర్టులో తన ఆవేదనను వ్యక్తం చేశారు. వ్యక్తిగత భద్రత ఉన్న తనను పోలీసులు క్రిమినల్ మాదిరిగా జైలుకు తరలించారనీ, తన భద్రత పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహారించారనీ, ఇదే కొనసాగితే తాను దీక్షకు దిగుతానంటూ న్యాయమూర్తి ఎదుట తన నిరసనను వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై న్యాయమూర్తి సంబంధితుల నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. జగన్ ను చంచల్గూడ జైలుకు తరలించే ముందు ప్రత్యేక వాహనంలో తరలించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే కోర్టుకు వచ్చిన జగన్ను ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల తదితరులు కొంతసేపు మాట్లాడారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు జగన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో జైలుకు తరలించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: