ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ కంచుకోట‌ మార్కాపురం  నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం రంజుగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచిన జంకె వెంక‌ట్‌రెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చేందుకు ఆపార్టీ అధిష్ఠానం నిరాక‌రించింది. దీంతో ఆయ‌న ఏం నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నేది ఇప్పుడు ఆస‌క్తిదాయ‌కంగా మారింది. వాస్త‌వానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 14సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే దాదాపు 10 రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌లే గెలుస్తూ వ‌చ్చారు. ఆ ప్ర‌భావంతో ఇక్క‌డ  ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులంద‌రూ కూడా రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి పెద్ద‌పీట వేసే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక ఈ ఎన్నిక‌ల్లోనూ అదే వైఖ‌రి కొన‌సాగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.


 ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ నేత‌ల్లో చాలా మంది ఇప్పుడు వైసీపీలో కొన‌సాగుతుండ‌టం..ముఖ్యంగా ద్వితీయ‌, క్షేత్ర‌స్తాయి నేత‌లు ఎక్కువ‌గా వైసీపీలో చేరిపోవ‌డం ఆ పార్టీకి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బాగా క‌ల‌సి వ‌చ్చింద‌ని చెప్పాలి. ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే  ఆ పార్టీ ఆవిర్భ‌వించిన నాటి నుంచి  2009లో ఒక్క‌సారి మాత్ర‌మే ఇక్క‌డ విజ‌యం సాధించ‌గ‌లిగింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కందుల వెంక‌ట నారాయ‌ణ‌రెడ్డికే మ‌ళ్లీ ఈ సారి బ‌రిలోకి దిగ‌డం ఖాయంగా మారింది. ఇక వైసీపీలో మాత్రం వ‌ర్గ రాజ‌కీయాలు న‌డుస్తుండ‌టం విశేషం. ఇక్క‌డి నుంచి  మాజీ ఎమ్మెల్యే కేపీ రెడ్డి త‌న‌యుడు నాగార్జున‌రెడ్డికి టికెట్ కేటాయించేందుకు అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.


వాస్త‌వానికి జంకె వెంక‌ట్‌రెడ్డి గెలిచిన నాటి నుంచే  ఇక్క‌డ కేపీరెడ్డి మ‌రో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాస‌రెడ్డిల ఆధ్వ‌ర్యంలో అస‌మ్మ‌తి కొన‌సాగుతోంది. నాగార్జున‌రెడ్డికి ఉడుమ‌ల స్వ‌య‌నా మామ కావ‌డంతో ఆయ‌న‌కు టికెట్ ద‌క్కించేందుకు ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు విశ్వ ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చారు...విజ‌యం సాధించార‌నే చెప్పాలి. ఇప్పుడు జంకె ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఆయ‌న ఏం నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నేది ఇక్క‌డ హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున‌రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పాల్గొన్న‌ది లేదు. త‌న సొంత ఇంజ‌నీరింగ్ క‌ళాశాల బాధ్య‌త‌ల్లో నిమ‌గ్న‌మైన ఆయ‌న ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో అడుగుపెట్ట‌బోతుండ‌టం విశేషం. కొడుకు..అల్లుడిని గెలిపించుకోవాల్సిన బాధ్య‌త‌ను వైసీపీ అధిష్ఠానం ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేల‌పై పెట్టిన‌ట్లు స‌మాచారం.  ఇక్క‌డ టీడీపీ విజ‌యం సాధించి త‌న సత్తా చాటాల‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారం షూరు చేసింది. ఇక్క‌డ హోరాహోరీ ఉండ‌బోతోంద‌న్న‌ది నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: