హైదరాబాద్: క్రమశిక్షణతో మెలగాల్సిన ఖాకీలు అదేనండీ మన పోలీసులు దారి తప్పుతున్నారు. తప్పులు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసులే తప్పులు చేస్తున్నారు. వీధినపడుతున్నారు. పోలీస్ మ్యాన్యువల్స్ ను అతిక్రమిస్తున్నారు. మన ఖాకీల్లో రోజు రోజుకూ క్రమ శిక్షణ కొరవడుతోంది. పోలీసుల తీరును చూసి ఔరా! వీరు మన పోలీసులేనా?అనే అనుమానం కలుగుతోంది. మొన్న గుంటూరు,నిన్న రంగారెడ్డి జిల్లా, నేడు తూర్పు. ఇలా పోలీసులు హద్దులను దాటుతున్నారు. ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా వ్యవహారిస్తున్నారు. ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారో, డబ్బుల కోసం కొట్లాడుకుంటున్నారో తెలియదు కానీ, మొత్తానికి ఖాకీల మధ్యన ఆగాధం మాత్రం పెరుగుతోంది. ప్రజల్లో పలచనవుతున్నారు. శాంతిభద్రతల్ని కాపాడాల్సినే వారే రూల్స్ను ఉల్లంఘిస్తున్నారు.గుంటూరు జిల్లా ఎస్సీ-అర్బన్ ఎస్పీల మధ్యన చోటుచేసుకున్న సంఘటన మరవకముందే రంగారెడ్డి జిల్లా ఏపీఎస్పీ బెటాలీయన్ పోలీసు కానిస్టేబుళ్ల కోసం వారి భార్యలు రోడ్డెక్కారు. అది మరిచి పోకముందే తూర్పు ప్రాంతంలో ఓ ఏఎస్పీ ఏకంగా ఎస్పీపై మీడియాకు ఎక్కారు.  ఎస్పీ-ఏఎస్పీల మధ్యన నెలకొన్న వివాదం రాష్ర్ట వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల పరువు బజారునపడ్డది. అంతర్గతంగా ఏమైనా సమస్యలుంటే పైస్థాయి అధికారులకు చెప్పుకోవాలి. కానీ, అలా చేయకుండా, ఏకంగా మీడియాకు ఎక్కడం, రోడ్డెక్కడం ఇటీవలి కాలంలో రివాజుగా మారింది. రంపచోడవరం ఏఎస్పీ నవీన్ కుమార్ ఏకంగా తనను ఎస్పీ త్రివిక్రమవర్మ చంపించడానికి కుట్రపన్నారనీ, దీని వెనక కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి రాకెట్ వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటి ఆగకుండా, ఈ వ్యవహారం వెనక డీఐజీ, డీజీ స్థాయి అధికారుల ప్రమేయం వుందంటూ ఆరోపణ చేశారు.  అంతేకాదు, దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయంటున్నారు. ఏఎస్పీ నవీన్ కుమార్ చెప్పింది నిజమే అయితే విచారణ చేయించాల్సిన బాధ్యత హెంశాఖ మంత్రి సబితా, ఇతర ఉన్నతాధికారులపైన వుంది. మొత్తానికి ఇటీవలి కాలంలో పోలీలసుల తీరు ప్రజలు అసహ్యించుకునే విధంగా తయారైందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.    

మరింత సమాచారం తెలుసుకోండి: