తెలంగాణ వాదంపై పరకాల ఫలితం ప్రభావం చూపనుందా? ఉపఎన్నికల్లో కొండ సురేఖ పరకాలలో పరాభవం పొందిన భవిష్యత్తు ఎన్నికలకు కొండంత బలాన్నిచ్చినట్లేనా. కరడు కట్టిన తెలంగాణ కోటకు యువనేత జగన్ బీటలు వేశారని రాజకీయ విశ్లేషకులు వివరిస్తుండటం శోచనీయమే. పైపెచ్చు మానుకోట గాయానికి పరకాల ఫలితం మందులా పనిచేసిందని భావిస్తుండటం బాధకరం. పరకాల ఫలితం తెరాసకు అనూకూలంగా ఉన్నా ఏదో తెలియని భయం వారిని ఎందుకు వెంటాడుతోంది.ఒకవైపు ఓటరు తీర్పు తెరాసను గెలిపించినా మరోవైపు ఏ విధంగా కలవరపెడుతోంది. కేవలం తెలంగాణ వాదంతో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ర్టసమితి బలపడిన విషయం విధితమే. తెలంగాణ వాదానికి, నినాదానికి కేసిఆర్ తిరిగి ప్రాణం పోశారని నిఖ్ఖచ్చిగా చెప్పవచ్చు. గడచిన దశాబ్ద కాలంలో తెలంగాణ వాదాన్ని బలోపేతం చేసిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కింది. తెలంగాణ జిల్లాల్లో ఊరూరా తెలంగాణ వాదాన్ని విస్తరించడంలో ఇతర పార్టీలకు ఉనికి లేకుండా పోయాయి. తెలంగణపై తమ చిత్తశుద్ది నిరూపణ కోసం తెరాస ఎమ్మేల్యేలు తమ పదవులు త్యజించారు.  వారి త్యగాలను గుర్తించిన తెలంగాణ ప్రజలు తిరిగి వారికి పదవులు అందించారు. తెలంగాణ వాదమే తెలంగాణ ప్రజలకు వేదంగా మారిందని తెదెపా, కాంగ్రెస్ గుర్తించాయి. తెలంగాణ వాదాన్ని భుజాలకు ఎత్తుకోకపోతే తమకిక రాజకీయ భవిష్యత్తు లేదన్న నిర్ధారణకు వచ్చేశారు. ఈక్రమంలో తెలంగాణలోని తెలుగుతమ్ముళ్ళు , కాంగ్రెస్ సోదరులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ వేడికి ‘హస్తం’లో అల్లకల్లోలంతోపాటు , తెలుగుతమ్ముళ్ళ వలసలు మొదలయ్యాయి. తెలంగాణకు మద్దతుగా మాట్లాడని నేతలు తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ లో కరడుకట్టిన నేతలు సైతం జై తెలంగాణ అనక తప్పలేదు.  కాగా కాలక్రమంలో తెలంగాణ కోసం ఆవిర్భవించిన తెరాసలో రాజకీయాలు అధికమయ్యాయి. ఇదే అదనుగా భావించిన వైఎస్ ఆర్ సిపి, తెదెపా, కాంగ్రెస్ లు తెలంగాణలో తమదైన శైలిలో రాజకీయ పావులు కదిపాయి. తెలంగాణ సాధన కోసం సమిధలైన యువకుల కుటుంబాలకు తెరాస నేతలు ఏం సమాధానం చెబుతారు? ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన ఉద్యమాలు ఉనికి కోసం చేసినవేనా? ఉద్యమ సెగలతో ఢిల్లీ పెద్దలను గజగజ వణికించింది రాజకీయాల కోసమేనా? ఢిల్లీ పెద్దలు వేసిన కమీటీలు కేవలం కాలయాపన నాటకాలేనా. తెలంగాణ నినాదం, వాదం తమ పేటెంట్ గా భావించి చివరకు ఉనికి కోల్పోయే స్థితిలో వున్న తెరాసకు ప్రత్యామ్నయంగా తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అవసరమే మరి...? 

మరింత సమాచారం తెలుసుకోండి: