ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలుకావడంతో రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం క్లసు పీకింది. అదేవిధంగా ఓటమిపై ఆగ్రహించిన అధిష్టానం బొత్సను సైతం విడిచిపెట్టలేదు. ఆయనకు కూడా ఓ డోసు ఇచ్చేశారు. గడచిన రెండేళ్ళలో రాష్ర్టంలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా మారిందని స్వపక్షంలోని కోవర్టులు అధిష్టానానికి ఉప్పందించారు. ఈ రెండేళ్ళ కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తరచూ ఓటమి చవిచూస్తూనే ఉందని కాంగ్రెస్ లోని అసమ్మతి వాదులు, అసంతృప్తులు నేరుగా సోనియాకే తెలియజేశారన్నది సమాచారం. కాగా రాష్ర్టపతి ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న సోనియా కిరణ్, బొత్సలకు కేవలం అక్షింతలు వేసినట్లు రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు దక్కించుకోవడం అవమానమని అధిష్టానం మండిపడుతోంది. పెపెచ్చు ఆ రెండు సీట్లకు సైతం ఢిల్లీ పెద్దలు ప్రచారం నిర్వహించడం ఏంటని? సోనియా రాష్ట్ర రాజకీయ పరిశీలకులైన వాయిలాల్ రవి, అజాద్ లకు సైతం మందలింపులు జరిగినట్టు భోగట్టా..? రాష్ర్ట రాజకీయాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని, గెలుపోటములు సర్వసాధరణమే కాని ఘోరంగా ఓటమి చెందటానికి గల కారణాలు తెలియజేయాలని సోనియా ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణలకు ఆదేశించారు. కేవలం రాష్ట్రంలో నేతల మధ్య సమన్వయం కొరవడిన కారణంగానే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమని అధిష్టానం గ్రహించింది. ఈక్రమంలో రాష్ట్రపతి ఎన్నికల అనంతరం రాష్ర్టరాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పండితులు ఘంటాపధంగా చెబుతున్నారు. ఒక దశలో రాష్ట్టంలో కాంగ్రెస్ బలహీనంగా మారేందుకు తెలంగాణ అంశం సైతం కారణమేనని తెలుసుకున్న అధిష్టానం తాజాగా తెలంగాణ అంశంపై సంచలనాత్మక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాయలసీమహక్కుల వేదిక నాయకుడు, మంత్రి టి.జి వెంకటేశ్, రాష్ట్ర న్యాయశాఖ మాత్యులు ఏరాసు ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ అశంపై అధిష్టానం అనుకూల ప్రకటన చేస్తుందన్న సమాచారం అందటంతో ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రనేతలు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వవైభవానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఢిల్లీ పెద్దలు రహస్యభేటి జరిగిందన్నది సమాచారం.  ఇటీవల కాలంలో వైఎస్ఆర్పీసి బలోపేతం కావడానికి సైతం కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యమత్యం లేకపోవడమేనన్న కోణంలో అధిష్టానం సమాలోచనలు సాగిస్తోంది. ఈక్రమంలో వైఎస్ పథకాలను మరికొంత మార్పు చేర్పులు చేసి ప్రజలకు అందించాలని, అంతేకాకుండా రాష్ట్రంలో నాయకత్వ మార్పతోనే కాంగ్రెస్ బలపడే అవకాశాలున్నాయని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన వెనువెంటనే రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయా? లేదా అన్నది వేచిచూడాలిమరి....?

మరింత సమాచారం తెలుసుకోండి: