హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవరావు అలియాస్ కేకే కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా? కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్ లోకి వెళ్తారా? అంటే తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఔననే సమాధానమిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కోసం కేకే ఎంతో కాలంగా పోరాడుతున్నారు. పదవుల్లో ఉన్నప్పుడు మాత్రం తెలం‘గానం’ అంతగా ఎత్తుకోరు. పదవులు భర్తీ చేసే టైంలో కూడా ‘ప్రత్యేక’ అంశాన్ని అటకెక్కిస్తారనే అపవాదును కేకే మూటగట్టుకున్నారు. అయితే, ఇప్పుడు కేంద్రంలో కాని, రాష్ర్టంలో కాని భర్తీ చేయాల్సిన పదవులేమీ లేవు.  ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొక్కాబోర్లా పడ్డది. డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. భవిష్యత్ లో కూడా ఇటు తెలంగాణలో కాని, అటు సీమాంధ్రలో కాని బతికి బట్ట కడతదనే నమ్మకం చాలా మంది కాంగ్రెస్ నేతల్లో లేకుండాపోయింది. వారిలో కేకే ముందు వరుసలో ఉన్నట్లు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏమైనా మనగడను సాధించాలంటే తెలంగాణ ఇవ్వాల్సిందేనంటున్నారు.  కాదు, పోదు అని మొండికేస్తే భవిష్యత్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ గెలవరనేది ఆయన వాదన. ఆయన బహిరంగంగానే తన మనసులోని మాటల్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా కూడా వుందంటున్నారు. కేకేకు తెలంగాణలో కాంగ్రెస్ బాగుండాలనే కోరుకుని వుండవచ్చు, కాని, ఆయన మాటలు పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. కాంగ్రెస్ అధి ష్టానంతో దగ్గరి సంబంధాలున్న కేకేకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేదనీ తెలిసీ ఇలా మాట్లాడి వుండవచ్చు. కేకేను సీడబ్య్లుసీలో స్థానం ఇవ్వకపోవడం, తరువాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తిరిగి నామినేట్ చేయలేదు.  కేకే కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు బాగానే లాబీయింగ్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచి కేకే కాంగ్రెస్పై కొంత అసంత్రుప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేకే కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడటమే కాకుండా, ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో అన్ని విషయాలు మాట్లాడుకున్నట్లు అత్యంతమైన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే కేసీఆర్కు అనుకూలంగా వ్యవహారిస్తూ వస్తున్నారు.  కేకేను టీఆర్ఎస్లోకి కేసీఆర్ ఆహ్వానించారనీ, టీఆర్ఎస్లోకి వస్తే వచ్చే ఎన్నికల్లో మెదక్ లోక్ సభ సీటు ఇచ్చేందుకు కేసీఆర్ హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి మానసికంగా సిద్ధమైన తరువాతనే కేకే కాంగ్రెస్ తెలంగాణకు విలన్గా మారిందంటున్నారు. కేకే బాటలో తెలంగాణ కాంగ్రెస్కు చెందిన మరికొందరు ప్రజాప్రతినిధులు నడిచేందుకు రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: