హైదరాబాద్: రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, గవర్నర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే డి.శ్రీనివాస్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, డిఎల్.రవీంద్రారెడ్డి, పనబాక లక్ష్మి, జె.సి. దివాకర్ రెడ్డి వంటి సీనియర్లందరూ అక్కడే మకాం వేయగా....తాజాగా ఈ సాయంత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్లు, పలువురు మంత్రులు ఢిల్లీ బయలుదేరనున్నట్లు సమాచారం. అధిష్టానం పిలుపు మేరకు వీరు వెళ్తున్నట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, హెంశాఖ మంత్రి చిదంబరం, రాష్ర్టపతి అభ్యర్థి ప్రణబ్, ఇతర పెద్దల్ని గవర్నర్ నరసింహన్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నరసింహన్ ఎప్పటిలాగనే రాష్ట్రానికి సంబంధించి తానేమీ తాజా రాజకీయ పరిస్థితులపై నివేదికలను ఇవ్వలేదంటూనే ఇప్పుడున్న పరిస్థతుల్లో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదంటూ సెలవించారు.  గవర్నర్ ఢిల్లీ పెద్దల్ని కలిసిన అనంతరం రాంష్ర్టానికి చెందిన ఇతర సీనియర్ నాయకులు , మంత్రులు కూడా కలిశారు. వీరు మాత్రం రాష్ట్ట్రానికి సంబంధించిన రాజకీయాలపై సోనియాగాంధీతో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి సోనియాకు వివరించామంటున్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి...ఉప ఎన్నికల టైంలో జగన్ను అరెస్టు చేసి ఉండికూడదనే అభిప్రాయంతో సోనియాగాంధీ ఉన్నట్లు చెప్పారు.  రాష్ర్టంలో జగన్ను హవా వుందంటూనే కాంగ్రెస్ కూడా మరీ బలహీనంగా లేదన్నారు. అయితే, ఎవరికి వారుగా కలిసినా కూడా ఫిర్యాదులు మాత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది. సోనియాను కలిసిన మరో నేత జేసీ మాత్రం తమకు రాయల తెలంగాణ అయితే ఒకేనని అన్నారు. దీనితో ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. తెలంగాణకు చెందిన మంత్రులను ఢిల్లీకి రావల్సిందిగా కబురు పంపినట్లు సమాచారం. దీనితో టీ-మంత్రులు ఈ సాయంత్రమే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో తెలంగాణకు సంబంధించి సంప్రదింపులు జరిపే అవకాశాలున్నాయి.  ఎవరు ఎన్ని విధాలుగా చెబుతున్న రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా వుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆ దిశగా అడుగులు వేస్తున్నదనీ, దీనిలో భాగంగానే తెలంగాణపై చర్చించడానికి ఈ ప్రాంత మంత్రులను ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణ దిశగా కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలనే నిశ్చయానికి వచ్చినట్లు హస్తినలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు చెబుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావంతో వారందరూ ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: