విద్యాసంస్థల్లో ప్రతిఏడాది ఫీజలు పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై అడ్డుకట్ట వేయాల్సిన విద్యాశాఖాధికారులు, ప్రభుత్వం చోద్యం చూస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 20శాతం ఫీజులు పెరిగాయంటే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. మన రాష్ర్టంలో పసిపాపకు ప్లే స్కూల్ పేరుతో రూ.75 వేలు, నర్సరీలో రూ.లక్ష, ప్రాథమిక స్థాయిలో లక్షన్నర ఫీజుల్ని విద్యాసంస్థల యాజమాన్యాలు దండుకుంటున్నాయి. ఇది నాణ్యానికి ఒకవైపు అయితే మరో వైపు రవాణ ఫీజులు, పుస్తకాలు, బట్టలు, టై, బూట్లు, బ్యాగులు ఆయా అక్కడే కొనాలనే నిబంధన విధిస్తున్నారు. వీటి ధరలు రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. ఇది జీ.ఓ.91 విరుద్ధం. మరి కొన్ని విద్యాసంస్థలైతే ఫీజు వద్దు,.. ఇతర ఖర్చులు వద్దు. రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ఫిక్సెడ్ డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుందంటూ ఊదరగొడుతున్నారు. పిల్లల చదువుల పట్ల ఆసక్తితో తల్లిదండ్రులు ఈ నిబంధనలు తలొగ్గక తప్పడంలేదు. ఈ విద్యా సంస్థలు బోర్డు తిప్పేస్తే ఇక అంతే సంగతులు. ఇంత ఫీజుల దందా నడుస్తుంటే ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు రాజకీయ నాయకులవి కావడం విశేషం. ఫలితంగా పోరాడి సాధించుకున్న ఫీజుల నియంత్రణ ఆటకెక్కింది. ప్రభుత్వాన్ని నమ్ముకుంటున్న యాజమాన్యాలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. 2009లో ప్రైవేటు పాఠశాలల విచ్చలవిడి ఫీజులను నియంత్రిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగొచ్చిన సర్కారు ఇంటర్ బోర్డు కమిషనర్, ఆయా జిల్లా కలెక్టర్లు, లా అదనపు కార్యదర్శి, పాఠశాల విద్యా డైరెక్టర్, యాజమాన్యాల తరపున ఒక కరెస్పాండెంట్ తో కలిపి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ తల్లిదండ్రులు, యాజమాన్యాలు, విద్యార్ధి సంఘాలతో చర్చించింది. వివిధ రాష్ర్టాల్లో ఫీజులను పరిశీలించి ఆ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ర్ట ప్రభుత్వం 2009 ఆగస్టు 6న జీ.ఓ.నెం.91 విడుదల చేసింది. రాష్ర్టంలో ఐఐటీ, ఒలింపియాడ్, కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ వంటి ఆకర్షణీమైన పేర్లతో విద్యార్థుల నుండి అధికమొత్తంలో ఫీజులు గుంజుతున్నాయి. కాబట్టి ఆ పేర్లన్ని రద్దుచేసి, సాధారణ పాఠశాలలుగానే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన సామాగ్రి కోసం బయట కనీసం మూడు షాపులు సూచించాలని పుర్కొంది. ప్రవేశ దరఖాస్తు విలువ రూ.100 మించరాదు. పేరు నమోదుకు రూ.500 మించరాదు. మౌలిక సౌకర్యాలు, ఉపాధ్యాయుల జీతాలు, యాజమాన్యాల లాభాలు కలుపుకొని ట్యూషన్ ఫీజులు ఉండాలని నిర్దేశించింది. జీ.ఓ.91 ప్రకారమే ఫీజులు, ఇతరత్ర ఖర్చులు వసూలు చేయాలని నొక్కి చెప్పింది. కానీ ఇవన్నీ గాలి దీపంలా మూణ్నాళ్ల ముచ్చటే అయ్యాయి. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఫీజుల నియంత్రణపై చర్యలకు పూనుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: