ఒక కన్ను ఒకవైపు,రెండో కన్ను మరోవైపు చూస్తే ముందున్న దారి ఎలా కన్పిస్తుంది.ప్రస్తుతం టిడిపి రథసారథి చంద్రబాబునాయుడిది ఇదే పరిస్థితి. ఇప్పటికే రెండు కళ్లగొడవతో సతమవుతున్న ఆయనకు కొడాలినాని రూపంలో మరో చిక్కు ముంచుకువచ్చింది. చిక్కులన్నింటికి తనుచేసిన పొరపాట్లే కారణం కావడంతో ఎవరిని ఏమి అనలేక, తనను తాను నిందించుకోలేక సతమతమవుతున్నారు ఆయన.తెలంగాణ,సమైక్యాంధ్ర విషయంలో ఎటూ తేల్చుకోలేక కళ్లు తేలేస్తున్న ‘బాబు‘కు రాష్ట్రపతి ఎన్నికల్లోను ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇదే మంత్రాంగాన్ని తన యంత్రాంగంతో చర్చిస్తూ సతమతమవుతున్న వేల కొడాలినానిపై తప్పనిసరిగా వేటువేసే పరిస్థితులు తెచ్చుకోవడం కూడా మున్ముందు కొత్తచిక్కులు తెచ్చిపెట్టనుంది. ఈమద్యకాలంలో పార్టీరాజకీయాలను వదిలి బంధుత్వాలను కలగలుపుతూ నడిపిన జిమ్మిక్కుల వ్యవహారాలే బెడిసికొట్టి కొడాలినాని రూపంలో తొలిషాక్ ఇచ్చిందన్న వాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈవిషయమే కాదు ప్రత్యేక తెలంగాణ విషయంలో ప్రదర్శించిన రెండుకళ్ల సిద్దాంతమే వీటన్నింటికి అసలైన కారణమని కూడా అంటున్నారు. తెలంగాణకన్ను ఎప్పుడో బెడిసికొట్టి ఎందరోనేతలు పార్టీని వీడగా, అప్పట్లో సీమాంధ్రలో టీడిపి నేతలకు వేరే ప్రత్యామ్నాయం లేక ఆగిపోయారని,ఉపఎన్నికల్లో విజయధుందిభి మోగించడంతో వారికి వైఎస్సార్ సీపి రూపంలో అది దొరకడంతో దూకుడు పర్వం కొడాలినానితో మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ పై ఆయన రెండుకళ్లు తలోవైపు చూస్తున్నాయి. తెలంగాణ వ్యతిరేకి పేరుతో ఈకన్నునేతలు ప్రణబ్ ను వ్యతిరేకిస్తుండగా,కాంగ్రేస్ అభ్యర్థికి ఎలా ఓటువేస్తామంటూ సీమాంధ్రకన్ను నేతలు అంటున్నారు.అలాకాదని సంగ్మాకు మద్దతియ్యాలని నిర్ణయిస్తే బీజెపి మద్దతిచ్చే అభ్యర్థికి ఓటేస్తే మైనార్టీలకు వ్యతిరేకులమవుతామని విభేదిస్తున్నారు.ఎటూ కాకుండా ఎన్నికలకు దూరంగా ఉందాం అంటూ చంద్రబాబు ప్రతిపాదించినప్పటికి ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో పాలుపంచుకోకపోతే పరువుపోతుందంటూ ఆనిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఒకప్పుడు ఏది చెబితే అది తలవంచుకొని ఊ కొట్టే పార్టీక్యాడర్ ఇప్పడు ఏది చెప్పినా నో అనే స్థాయికి రావడాన్ని కూడా చంద్రబాబునాయుడు దిగమింగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: