ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్ధులు.. వెంటనే వారికి ఉన్న అర్హతలకు తగిన మంచి ఉద్యోగం సంపాదించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పోర్టల్‌ను ముందుకు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ లేబర్, ఎంప్లాయిమెంట్‍ విభాగం ఆధ్వర్యంలో.. “నేషనల్‍ కెరీర్‍ సర్వీస్‍ పోర్టల్‍” ప్రారంభించింది. ఇది నిరుద్యోగులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా.. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సీటీలు నుంచి ఉన్నతవిద్యలు చదువుకున్న లక్షల మందిలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌ ప్లేస్‌మెంట్‌లో కేవలం 10శాతం మంది విద్యార్ధులు కూడా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. 


ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తెలియక... స్థానికంగా ఉండే చిన్న చిన్న కంపెనీల్లో ఉండే ఉద్యోగాల్లో చేరుతున్నారు. గ్రాడ్యూయేట్స్, పోస్ట్ గ్రాడ్యూయేట్స్, ఇంజనీరింగ్ చేసిన విద్యార్ధుల వారీగా అన్ని విభాగాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు ఉన్నాయి.  నగరాల్లో ఉండే అనేక ప్రైవేట్, కార్పోరేట్ కంపెనీల వివరాలు.. వాటిలో ఉండే ఉద్యోగ సమాచారంకి సంబంధించిన వివరాలు, అర్హతలు అన్ని ఈ పోర్టల్‌లో లభ్యమవుతాయి. దేశ వ్యాప్తంగా వివిధ ఐటీ, కార్పొరేట్‍ కంపెనీల్లో ఉన్న జాబ్స్ వివరాలను అందరికి తెలిసేలా.. ఈ నేషనల్‍ కెరీర్‍ సర్వీస్ పోర్టల్‍ను డెవలప్ చేసింది.


 ఈ పోర్టల్‍లో ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ మేళాల వివరాలను నిర్వాహకులు పోర్టల్‍లో అప్‌డేట్‌ చేస్తున్నారు.   ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వారి నుంచి.. మొదలు.. బీటెక్, ఎంటెక్ చేసిన విద్యార్ధుల వరకు ఉద్యోగాలు ఉన్నాయి. 
దీంతోపాటు ఆయా రాష్ట్రాల పరిధిలో ఉండే ఉద్యోగాల వివరాలు తెలుసుకోవడానికి జాబ్‍ సీకర్స్ అనే ఆప్షన్‍ కింది వివరాలను చూసుకునే వీలుంది. పోర్టల్‍లో వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థుల ఫోన్‍లకు.. ఉద్యోగాల వివరాలు పంపడంతోపాటు వారి పరిధిలోని ఎంప్లాయిమెంట్‍ ఎక్స్‌ఛేంజ్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‍మేళాల వివరాలను కూడా పంపనున్నారు. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ముందుగా https://www.ncs.gov.in/ వెబ్‍సైట్‍లో లాగిన్‍ అయి ఏయే ఉద్యోగాలకు అర్హత ఉన్నారో.. పోర్టల్‍లో నమోదు చేయాలి. 

మీ వివరాలు నమోదు చేయగానే 19 డిజిట్‍ గల యూజర్‍ ఐడీ వస్తుంది.  దీనితో ప్రతిసారి లాగిన్‍ అయ్యి.. ఎక్కడ ఏమేం ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయో, కొత్తగా ఏమైనా ఉద్యోగాలు వచ్చాయో చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ పోర్టల్‌లో 1.06 కోట్ల మందికి పైగా నిరుద్యోగులు.. ఉద్యోగాల కోసం వివరాలను నమోదు చేసుకున్నారు.  ప్రస్తుతం 2.91 లక్షల కొలువులు వివిధ కంపెనీల్లో ఉన్నాయి.  ఇక దీనికి సంబంధించిన సమాచారం కోసం 18004251514 టోల్‍ఫ్రీ నంబర్‍ కూడా అందుబాటులో ఉంది. ఇది ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు పనిచేస్తోంది. మరింకెందుకు  ఆలస్యం  నిరుద్యోగులు… ఇక ఉద్యోగం లేదు అంటూ చింతించకుండా.. వెంటనే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో మీ వివరాలను నమోదు చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: