రెండు సంవత్సరాల క్రితం గాలిలోంచి విమాన ఇంధనం  తయారు చేసే అవకాశం ఉందని వార్తలు రావడంతో అంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఏకంగా గాలి నుంచి విమానం ఇంధనం తయారవుతుందనడంతో విమానయాన రంగం కష్టాలన్నీ తీరిపోయినట్లే అని అంతా భావించారు. ఎందుకంటే అసలు విమానయాన రంగం కష్టాలన్నీ ఇంధనం వల్లనే జరుగుతున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న చమురు ధరలు, వాటి ఖర్చు ఆకాశం నుంచి అంతరిక్షం  దాటుతోంది. దాంతో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వైపు అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ అదెందుకో కార్యాచరణకు నోచుకోలేదు.

ఇప్పుడు తాజాగా భారత సంతతికి చెందిన ఓ శాస్త్రవేత్త మరో కొత్త ఆవిష్కరణతో వార్తల్లోకి ఎక్కారు. ఆయన నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ సరికొత్త విషయాన్ని ప్రకటించారు. ఆవాల మొక్క ద్వారా విమాన ఇంధనం అనగానే మరోసారి  ఆశలు చిగురించాయి. ఆవాల మొక్కల నుంచి తీసిన నూనె నుంచి విమాన ఇంధనం  తయారు చేయొచ్చని ఈ బృందం నిరూపించింది. దీంతో ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు విమాన ఇంధనాల ద్వారా వెలువడే  కర్బన ఉద్గారాలను 68 శాతం తగ్గించవచ్చని వారు చెబుతున్నారు. నిజానికి అమెరికా వ్యాప్తంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో 2.5% విమానయాన రంగానిదిగా ఉంటుంది. ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన గ్లోబల్ వార్మింగ్ లో దీని పాత్ర 3.5% గా లెక్కలు కట్టారు పరిశోధకులు. ఆవాల మొక్కతో లీటర్ ఇంధనం  ఉత్పత్తి చేయడానికి కేవలం0.12 డాలర్లు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది చమురు ఇంధనంతో పోలిస్తే చాలా తక్కువ. ఈ ఇందనం ఉత్పత్తికి అవసరమయ్యే ముడి సరుకును ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే ఈ ఎకో ఇంధనాన్ని నిరంతరం ఉత్పత్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు. బయో ఫ్యూయల్ ని విమానాలకు వాడుకొనే విషయంలో గతంలోనూ ఇలాంటి విధానాలు వచ్చాయి.

ఈ తరహా ఇంధనం తయారీకి ఇప్పటికే ఓ సులభమైన సమర్థవంతమైన విధానం ఉంది. మొక్కలు పెంచడం, మొక్కల బయోమాస్ నుంచి తయారుచేసిన పునర్వినియోగ ఇంధనంతో నడిచే విమానాలు ఇప్పటికే ఉన్నాయి. నిజానికి చెరుకు పిప్పి, గడ్డి,పామాయిల్, జంతు వ్యర్ధాలు  ఇలా కార్బన్ ఉన్న ప్రతిదీ నిర్దేశిత ప్రక్రియను అనుసరించి ఇంధనంగా వాడుకోవచ్చు. దేశాలు తలుచుకుంటే సంప్రదాయ ఇంధనాలతో ప్రత్యామ్నాయ ఇంధనాలు పోటీ పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: