ఏడు కొండలపై పాము కనిపించింది అంటే చాలు అంతా హడలి పోతారు. కానీ ఆ ఒక్కడు మాత్రం వాడితో ఆడుకుంటాడు . వాటిని పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతాడు. ఒకటి కాదు రెండు కాదు పది వేలకు పైగా పాములను పట్టిన ఆయన,సర్పం కాటుకు  ప్రాణాలతో పోరాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. భాస్కర్ నాయుడు ఈ పేరు ఒక తిరుమలలోనే కాదు,తిరుపతి, ఇతర చుట్టుపక్కల ప్రాంతాలకు బాగా సుపరిచితమే. స్వామి సన్నిధిలో ఎక్కడైనా పాము కనిపిస్తే చాలు ఈయన వచ్చి పట్టుకుని దూరంగా తీసుకెళ్లి విడిచి పెడతారు.

30 ఏళ్ళకు పైగా తిరుమలలో ఎన్నో వేల పాములు పట్టుకున్న చరిత్ర  భాస్కర్ నాయుడుకి ఉంది. అయితే గత నెల 28న రక్తపింజర కాటు వేయడంతో  ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు భాస్కర్ నాయుడు. ఇక శేషాచల కొండల విషయానికి వస్తే ఇతర ప్రాణులతో పాటు 32 రకాల సర్ప జాతులు ఇక్కడ ఉన్నాయి. వీటిలో కోబ్రా, రక్తపింజరి, పైతాన్ వంటి సర్పాలు కూడా ఉన్నాయి. తిరుమల అభివృద్ధి కోసం అటవీ ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతుండడంతో పాములతో పాటు ఇతర జంతువులు కూడా జనావాసాల్లో సంచరిస్తున్నాయి. ఇక పాముల వల్ల భక్తులకు ఎలాంటి అపాయం కలగలేదంటే కారణం భాస్కర్ నాయుడు. టీటీడీలో ఫారెస్టు ఉద్యోగిగా చేరిన ఆయన మొదటి నుంచి పాముల్ని పట్టేవాడు. గత 32 సంవత్సరాలలో ఇలా దాదాపు పదివేలకు పైగా పాములను పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారాయన. తిరుమలలో ఎక్కడైనా పాము కనిపిస్తే చాలు,వెంటనే ఈయనకు కబురు వెళ్లడం, వచ్చి పట్టుకోవడం క్షణాల మీద జరిగిపోతాయి. ఇలా దాదాపు 25 రకాల పాముల్ని పట్టుకున్నారు. వాటిలో కట్లపాము మొదలుకొని రక్తపింజర, నాగుపాము, జెర్రిపోతు, కొండచిలువ వంటివి ఉన్నాయి. ఎలాంటి సర్పన్నైనా ఉడుపుగా పట్టేస్తారు భాస్కర్ నాయుడు. ఈ క్రమంలో ఎన్నో సార్లు ప్రమాదం అంచుల వరకు వెళ్లారాయన.

గతంలో పాముకాటుతో కొన్నాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన ఏడేళ్ల క్రితం రిటైరైనా ఎప్పటికప్పుడు పదవీకాలం పొడిగిస్తూ వస్తోంది టిటిడి. అలాగే ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా పొందారు. అలాంటి భాస్కర్ నాయుడు ఇటీవల రక్తపింజరను పట్టే క్రమంలో దాని కాటుతో ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. పాము కాటేసిన తర్వాత తానే స్విమ్స్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు. భార్య కి ఫోన్ చేసి రేపు ఉదయం కల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పారు. కానీ తర్వాత పరిస్థితి విషమించింది. అక్కడి నుండి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భాస్కర్ వెంటిలేటర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తన భర్తని ఎలాగైనా కాపాడాలని భాస్కర్ భార్య అధికారులను వేడుకుంటున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: