నెట్‌వర్కింగ్ విలువ చాలా మందికి తెలియదు. కేవలం బిజినెస్ కార్డులను ఇచ్చిపుచ్చుకునేందుకే సదస్సులు, సమావేశాలకు హాజరవుతుంటారు. కెరీర్‌లో రాణింపునకు మీ రంగంతోపాటు ఇతర రంగాలకు చెందినవారితో కూడా స్నేహ సంబంధాలను పెంచుకోవాలి. కొత్త పరిచయాలు కొత్త ఆలోచనలకు దారితీస్తాయి. ఈ నెట్‌వర్కింగ్‌తో మీ రోజువారి జీవితం మరింత సులభతరంగా మారుతుంది. భవిష్యత్తులో తప్పనిసరిగా సానుకూల ఫలితం లభిస్తుంది.
ప్రస్తుతం వస్తున్న జీతం కంటే మరో 20 శాతం అదనంగా వస్తే బాగుంటుందన్న ఆలోచన ప్రతి ఉద్యోగికి ఉంటుందంట. మెరుగైన వేతనాల కోసం కంపెనీలను, ఉద్యోగాలను వెంటవెంటనే మార్చేసే వారు ఎందరో ఉన్నారు. మరో కొలువులోకి మారితే బ్యాంకు బ్యాలెన్స్ కొంత పెరగొచ్చు. కానీ, అది కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆదాయం కంటే ముందు పనిలో అనుభవం, నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. లాంగ్ రన్‌లో ఇది మీకు కచ్చితంగా మేలు చేస్తుంది.
ఓటమి ఎదురవుతుందన్న భయంతో కొందరు సాహసాలు చేయడానికి వెనుకాడుతుంటారు. అయితే, క్లిష్ట పరిస్థితుల్లోనే ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఓటమి ఒక కొత్త పాఠా న్ని నేర్పుతుంది. జీవితం అంటే ఏమిటో తెలి యజేస్తుంది. కాబట్టి పనిలో రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. ఫెయిల్యూర్స్.. వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయి.
ఇతరులకు మంచి చేస్తే మీకు కూడా మంచే జరుగుతుంది. అవసరంలో ఉన్నవారికి సహకరిస్తే దాని ప్రతిఫలం భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ కెరీర్‌లో అలవరచుకోవాల్సిన ప్రధాన లక్షణం ఇది. కెరీర్‌లో సక్సెస్‌కు ప్రతిదశలో సహచరుల సహకారం అవసరం. ప్రయోజనం కలగాలనే దురుద్దేశం లేకుండా ఇతరులకు మనస్ఫూర్తిగా సహకరించండి. సహాయం చేయండి. ఇతరుల సహకారం పొందండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి