గులాబ్ తుపాను నేప‌థ్యంలో వాల్తేర్ డివిజ‌న్ కొన్ని రైళ్లు ర‌ద్దుచేసింది. మ‌రికొన్ని రైళ్ల‌ను దారిమ‌ళ్లించి న‌డ‌ప‌డంతోపాటు ఇంకొన్ని రైళ్ల గ‌మ్య‌స్థానాల‌ను కుదించింది. ఈమేర‌కు వాల్తేర్ డివిజ‌న్ డిప్యూటీ క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ త్రిపాఠి పూర్తివివ‌రాలు వెల్ల‌డించారు. ఈనెల 26వ తేదీన విశాఖప‌ట్నం నుంచి విజ‌య‌వాడ‌వైపు 10 రైళ్ల‌ను, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రంవైపు ఆరు రైళ్ల‌ను ర‌ద్దుచేశారు. 27వ తేదీన విశాఖ‌ప‌ట్నం మీద‌గా రాక‌పోక‌లు సాగించే మ‌రో 6 రైళ్ల‌ను కూడా ర‌ద్దుచేశారు. ఆదివారం పూరీ-ఓఖా ప్ర‌త్యేక రైలును ఖుర్దారోడ్‌, అంగూల్‌, సంబ‌ల్‌పూర్‌మీద‌గా దారి మ‌ళ్లించారు. అలాగే సోమ‌వారం విశాఖ‌ప‌ట్నం నుంచి బ‌య‌లుదేరే విశాఖ‌-కిరండూల్ రైలును జ‌గ‌ద‌ల్‌పూర్ వ‌ర‌కే న‌డిపిస్తారు. తిరుగు ప్ర‌యాణంలో మంగ‌ళ‌వారం జ‌గ‌ద‌ల్‌పూర్ నుంచే బ‌య‌లుదేరుతుంది. సాంకేతిక స‌మ‌స్య‌ల‌వ‌ల్ల‌, తుపాను నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు త్రిపాఠి తెలిపారు. పూర్తివివ‌రాలు తెలుసుకొని ప్ర‌యాణికులు వాల్తేర్ డివిజ‌న్‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. తుపాను తీవ్ర‌త‌ను బ‌ట్టి మ‌రికొన్ని నిర్ణ‌యాలు అప్ప‌టిక‌ప్పుడు తీసుకుంటామ‌ని, వాటిని కూడా తెలియ‌జేస్తామ‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: